
హసన్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటు వేస్తే.. కాంగ్రెస్ పార్టీకి వేసినట్లేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలంతా బీజేపీకి ఓటేసి, ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ సొంత జిల్లా అయిన హసన్‌లోని సక్లేశ్ పూర్ సెగ్మెంట్లో సోమవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడారు. ‘‘మీరు గత ఎన్నికల్లో జేడీఎస్‌ను గెలిపించారు. కానీ చివరికి వారు కాంగ్రెస్‌తో కలిసి కూర్చున్నారు. అందుకే జేడీఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే. మీరు కాంగ్రెస్ కు ఓటేయాలని కోరుకుంటున్నారా?” అని ఆయన ఓటర్లను ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో హసన్ జిల్లాలో బీజేపీ నుంచి ప్రీతమ్ గౌడ ఒక్కరే గెలిచారని, ఈ సారి మాత్రం జిల్లా అంతటా కమలాలు వికసించాలని షా అన్నారు. సక్లేశ్ పూర్లో బీజేపీ అభ్యర్థి సిమెంట్ మంజునాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ మళ్లీ తెస్తామని కాంగ్రెస్, జేడీఎస్ చెప్తున్నాయని.. లింగాయత్‌లు, వొక్కలిగలు, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరి రిజర్వేషన్ ను తగ్గిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కాగా, సక్లేశ్ పూర్ సెగ్మెంట్ నుంచి మాజీ సీఎం, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ఇక హసన్ జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2018 ఎన్నికల్లో హసన్ సెగ్మెంట్ మినహా మిగతా వాటిని జేడీఎస్ గెలుచుకుంది.