పార్టీ ఆఫీసుల్లో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుర్రి: బీఆర్ఎస్‎పై జగ్గారెడ్డి ఫైర్

పార్టీ ఆఫీసుల్లో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుర్రి: బీఆర్ఎస్‎పై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆఫీసుల్లో మాట్లాడటం కాదని.. ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై హరీష్​ రావు తెలంగాణ భవన్‎లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని.. అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆదివారం (జనవరి 4) గాంధీభవన్‎లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్లలో కట్టింది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టేనని.. అది కూడా  మూడేళ్లలోనే కుప్పకూలిపోయిందన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాకే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించిందని గుర్తు చేశారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లు కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రజలకు సింగూరు, మంజీరా డ్యామ్‌ల ద్వారా తాగునీరు సరఫరా అయితుందని తెలిపారు. 

►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు

తెలంగాణ రైతులకు సాగునీరు, తాగునీరు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలు మాట్లాడుకుంటే తప్పేంటని.. కేసీఆర్ గతంలో చంద్రబాబు, జగన్‎తో మాట్లాడలేదని అని నిలదీశారు. బీఆర్ఎస్ ఏం చేసినా కరెక్ట్.. రేవంత్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ మళ్లీ ఆంధ్ర, తెలంగాణకు కుంపటి పెడుతుందని ఫైర్ అయ్యారు.