కేటీఆర్.. లోకేశ్ను దొంగచాటుగా ఎందుకు కలిసినవ్ : జగ్గారెడ్డి

కేటీఆర్.. లోకేశ్ను దొంగచాటుగా ఎందుకు కలిసినవ్ : జగ్గారెడ్డి
  • త్వరలోనే ఆ రహస్య భేటీ వివరాలు బయటపెడ్తానని కామెంట్

హైదరాబాద్, వెలుగు: టీడీపీ ఎమ్మెల్యే లోకేశ్ ను దొంగచాటుగా కేటీఆర్  ఎందుకు కలిశారో తెలంగాణ ప్రజలకు ఆయన  సమాధానం చెప్పాలని కాంగ్రెస్  నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్  చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంగా కేసీఆర్  ఉన్న సమయంలో కూడా హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో లోకేశ్, జగన్ ను కేటీఆర్  వేర్వేరుగా కలిశారని ఆరోపించారు. అది బీజేపీ డైరెక్షన్ లో జరిగిందని చెప్పారు. ఏ ఫామ్ హౌస్ లో వారు భేటీ అయ్యారు, ఆ ఫామ్ హౌస్ ఎవరిది అనే విషయాలు తనకు తెలుసని, త్వరలోనే ఆ రహస్య భేటీ వివరాలు బయటపెడతానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడని కేటీఆర్, హరీశ్ రావు పదేపదే విమర్శిస్తున్నారని, మరి రేవంత్  కన్నా ముందు కేసీఆర్.. చంద్రబాబు శిష్యుడనే విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ తర్వాతే రేవంత్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తుచేశారు. రేవంత్ తో ముఖాముఖి అంటేనే మాజీ సీఎం కేసీఆర్  భయపడుతున్నాడని, అందుకే అసెంబ్లీకి ఆయన రావడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకే సీఎం మంత్రులను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లారని, ఈ విషయం బీఆర్ఎస్  నేతలు చూడడం లేదా అని ఫైర్  అయ్యారు.