
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య వాదం వినిపించారు. సీఎం కేసీఆర్ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు..ఉద్యమ సమయంలోనూ తాను సమైక్య వాదాన్నే వినిపించానని... అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. సమైక్యం.. నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదన్నారు.
ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు జగ్గారెడ్డి. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, నా వ్యక్తిగత అభిప్రాయం వేరన్నారు. ప్రజల ఆలోచన మేరకే వెళ్తా.. ఏ ప్రాంతానికీ నేను వ్యతిరేకం కాదన్నారు. ఇది ప్రజల డిమాండ్ కాదు..నాయకుల అభిప్రాయం మాత్రమేనన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం.. కానీ, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఆరోజు నన్ను తప్పుబట్టిన వారు .. ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారని అన్నారు.
'ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు. సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలను నేను తప్పుపట్టను.. ఎవరి అభిప్రాయాలు వారివి' అని అన్నారు జగ్గారెడ్డి.