- కర్రల దాడి కేసులో ట్విస్ట్..మహిళ తలలో బుల్లెట్?
జగిత్యాల/కోరుట్ల, వెలుగు: కుటుంబ ఆస్తి వివాదాల నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన దాడి కేసులో ట్విస్ట్ నెలకొంది. కర్రలతో దాడి చేశారంటూ నమోదైన కేసులో గాయపడిన మహిళ తలలో బుల్లెట్‌గా అనుమానిస్తున్న మెటల్ ఆబ్జెక్ట్ బయటపడింది. ఆ మెటల్ ఆబ్జెక్ట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. మెట్‌పల్లికి చెందిన గోనె తిరుపతి, అతని తమ్ముడు గోనె శంకర్ మధ్య కొంతకాలంగా తల్లిదండ్రులకు చెందిన సుమారు మూడెకరాల వ్యవసాయ భూమి పంపకాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నెల 14న అర్ధరాత్రి గాజులపేటలోని ఇంటి వద్ద గోనె లక్ష్మి(42), ఆమె భర్త తిరుపతిపై శంకర్, అతని మేనబావ గోపు ముత్తయ్య కలిసి దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో మొదట స్థానికంగా చికిత్స అందించి, తరువాత హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు గోనె శంకర్, గోపు ముత్తయ్యలను అరెస్టు చేసి 15న రిమాండ్‌కు పంపారు. మొదట దీనిని కర్రల దాడిగానే పరిగణించారు.
చికిత్సలో బయటపడ్డ మెటల్ ఆబ్జెక్ట్..
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మికి స్కానింగ్ చేయగా తల భాగంలో మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. శస్త్రచికిత్సలో దవడ సమీపం నుంచి బుల్లెట్‌గా అనుమానిస్తున్న వస్తువును బయటకు తీశారు. దాడి జరిగిన రాత్రి కాల్పుల మాదిరి శబ్దాలు వినిపించాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఘటన స్థలంలో బుల్లెట్ షెల్స్ లేదా ఇతర కీలక ఆధారాలు లభించలేదు. నిందితుల వద్ద కూడా ఎలాంటి ఆయుధాలు స్వాధీనం కాలేదు.
పరారీలో ఉన్న ఓ వ్యక్తి ద్వారా లోకల్ మేడ్ తపంచా తెప్పించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మెట్‌పల్లి సీఐ సురేశ్ బాబు స్పందిస్తూ.. ‘బాధితురాలి తలలో మెటల్ ఆబ్జెక్ట్ గుర్తించాం. అది బుల్లెట్టా కాదా అన్నది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది’ అని తెలిపారు.
