- ప్రపోజల్స్ సిద్ధం చేసే పనిలో ఆఫీసర్లు
- వివిధ అవసరాలకు ఇప్పటికే సాగేతర భూములను గుర్తించిన అధికారులు
- రెండేండ్ల కింద మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించగా..వ్యతిరేకించిన రైతులు
- ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసే యోచనలో ఆఫీసర్లు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మళ్లీ కదలిక వచ్చింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు ఇప్పటికే సాగేతర భూములను గుర్తించిన అధికారులు.. ప్రపోజల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. రెండేండ్ల కింద రైతుల ఆందోళనలతో మాస్టర్‌ప్లాన్–2041 ఆగిపోయిన విషయం తెలిసిందే. సాగు భూములకు ఇబ్బందులు రాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా ఆఫీసర్లు కసరత్తు చేపట్టారు.
నాటి ప్లాన్‌ను వ్యతిరేకించిన రైతులు
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మున్సిపాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. ఇందులోభాగంగా 2022 మార్చి 8న జగిత్యాల బల్దియా పాలకవర్గం మాస్టర్ ప్లాన్–2041 కోసం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌లో జీవో 238 ద్వారా ఈ తీర్మానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో నర్సింగాపూర్, మోతె, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హస్నాబాద్ గ్రామాల పరిధులను చేర్చి రిక్రియేషన్ జోన్, పబ్లిక్- సెమీ పబ్లిక్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ వంటివి ఏర్పాటుకు నిర్ణయించారు.
కాగా రైతుల సాగు భూముల్లో ఇండస్ట్రియల్ జోన్ కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆందోళనలు తీవ్రం కావడంతో అధికారులు డ్రాఫ్ట్ రద్దు చేశారు. కాగా గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సాగేతర భూములను గుర్తించారు. ఆయా జోన్లకు అనుగుణంగా ఉన్న స్థలాలను కేటాయించే పనిలో పడ్డారు. సాగుభూములను మినహాయించి సాగేతర భూముల్లో ఇండస్ట్రియల్, రిక్రియేషన్ జోన్లు కేటాయిస్తే రైతులు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని బల్దియా ఆఫీసర్లు భావిస్తున్నారు.
చిన్న రోడ్లు, సరిపోని డ్రైనేజీలు
జగిత్యాల బల్దియా పరిధిలో ఇప్పటికీ మాస్టర్ ప్లాన్–1989ను అమలు చేస్తున్నారు. అప్పటి అవసరాల దృష్ట్యా ఆ ప్లాన్ సరిపోయినా.. ప్రస్తుతం జనాభా పెరగడంతోపాటు జగిత్యాల జిల్లాకేంద్రంగా మారింది. నాటి ప్లాన్‌లో రూపొందించిన రోడ్లు, డ్రైనేజీలు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 40 వేలకు పైగా ఇండ్లు, లక్షకు పైగా జనాభా ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు. బల్దియాలో పరిసర ప్రాంతాల గ్రామాలను విలీనం చేయాల్సి ఉండగా, కేవలం శివారు ప్రాంతాల సర్వే నంబర్లను మాత్రమే విలీనం చేశారు.
దీంతో ధరూర్, మోతె జీపీల్లో పర్మిషన్లు తీసుకుంటూ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు బల్దియా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే పరిసర గ్రామాలను కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీపీలను కలపడంతో మాస్టర్ ప్లాన్ మూడు ముక్కలుగా కనిపిస్తోంది. కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే రోడ్ల విస్తరణతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ల గుర్తింపు వంటి అభివృద్ధి పనులు స్పీడ్ అందుకునే అవకాశముంది.
ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ అమలు
జగిత్యాల పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. గతంలో రైతుల ఆందోళనతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేశాం. రైతులకు నష్టం జరగకుండా ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసేలా అధికారులు ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ రూపొందిస్తాం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల
