జగిత్యాల/రాయికల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరిగే రాయికల్ మండలంలో నామినేషన్ల స్వీకరణను మంగళవారం పరిశీలించారు. వడ్డె లింగాపూర్, కొత్తపేట, అల్లీపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని నామినేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు.
నామినేషన్ స్వీకరణ, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆయన పలు సూచనలు అందించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. రెండో విడతలో 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1,276 వార్డుల్లో ఈనెల 14 న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుందన్నారు. ఆయనతోపాటు ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నోడల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీపీ ఎలక్షన్ల నోడల్ ఆఫీసర్లతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ఎన్నికలకు అవసరమైన అన్ని మెటీరియల్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. మూడు దశల్లో ఎన్నికల జరగనున్న దృష్ట్యా పీవో, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలి
బోయినిపల్లి,వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాక.. వారికి ఎన్నికల నియమావళి, ఖర్చు వివరాలు అందజేతపై అవగాహన కల్పించాలని రాజన్నసిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం బోయినిపల్లి మండల కేంద్రంలోని రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు.
నామినేషన్‌తోపాటు అభ్యర్థి కొత్త బ్యాంకు ఖాతా కచ్చితంగా అందజేయాలని, నామినేషన్ పత్రంలో అన్ని వివరాలు నింపేలా చూడాలన్నారు. అనంతరం హెల్ప్ డెస్క్ పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. బోయినపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంతకుముందు బోయినిపల్లి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్‌ను పరిశీలించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, సివిల్ సప్లై జిల్లా ఆఫీసర్ చంద్ర ప్రకాశ్, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల తదితరులు పాల్గొన్నారు.
