బీజేపీకి పెద్ద సైజ్ వాషింగ్ మెషీన్ అవసరం

బీజేపీకి పెద్ద సైజ్ వాషింగ్ మెషీన్ అవసరం
  • కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సెటైర్

న్యూఢిల్లీ :  మాజీ ఎంపీ, బిజినెస్​మ్యాన్ నవీన్ జిందాల్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. అవినీతి లీడర్లకు పట్టిన మురికిని వదిలించాలంటే బీజేపీకి పెద్ద సైజ్ వాషింగ్ మెషీన్ అవసరమని సెటైర్ వేశారు. పదేండ్లుగా కాంగ్రెస్​కు ఎలాంటి సేవలు అందించని జిందాల్.. ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం పెద్ద జోక్​ అని కామెంట్ చేశారు. జార్ఖండ్​లోని బొగ్గు బ్లాక్​ల కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసులో జిందాల్​ను సీబీఐ విచారిస్తోంది. ఇదే కేసులో మనీలాండరింగ్ అభియోగాలు మోపి ఈడీ దర్యాప్తు చేపట్టింది. వీటికి సంబంధించిన క్లిప్స్​ను జైరాం రమేశ్ ట్విట్టర్​లో షేర్ చేశారు. ‘‘అవినీతిపరులందరినీ సీబీఐ, ఈడీల ద్వారా భయపెడతారు. రకరకాల ఆరోపణలు చేస్తరు. అదే కళంకితులు బీజేపీలో చేరాక ఏ అవినీతి గురించి మాట్లాడరు” అని జైరాం కామెంట్ చేశారు. కాంగ్రెస్ లేని భారత్​ను బీజేపీ కోరుకుంటోందని, కానీ ఆ పార్టీ అవినీతిపరులు లేని కాంగ్రెస్​ను తయారుచేస్తోందని అన్నారు. 2004 నుంచి 2014 దాకా హర్యానాలోని కురుక్షేత్ర సెగ్మెంట్​ నుంచి జిందాల్ ఎంపీగా ఉన్నారు. ఆపై జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో పోటీ చేయలేదు. ఈ క్రమంలో జిందాల్​ కాంగ్రెస్​కు రిజైన్ చేసి ఆదివారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ అదే సెగ్మెంట్​ నుంచి జిందాల్​కు ఎంపీ టికెట్ కేటాయించింది.