
- గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన కౌశాంబి జైలు సిబ్బంది
కౌశాంబి: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా జైలు క్యాంపస్ మంగళవారం ఫంక్షన్‌కు వేదికైంది. జైలు అధికారులు మాయ అనే మహిళా ఖైదీ బిడ్డకు ట్వంటీ ఫస్ట్ డే వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. సెల్‌ను బెలూన్లతో అలంకరించి, ఖైదీలందరికీ స్వీట్లు, స్నాక్స్ పంచిపెట్టారు. తల్లీబిడ్డలకు కొత్త బట్టలు తీసుకువచ్చి, చంటిబిడ్డను ఉయ్యాలలో ఉంచి తల్లి ఇష్టప్రకారం ఆ పసిబిడ్డకు మాన్వి అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా 53 మంది మహిళా ఖైదీలతో కలిసి సిబ్బంది పాటలు పాడుతూ, మ్యూజిక్ ప్లే చేసి సంబురంగా కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఖర్చంతా సిబ్బందే భరించినట్లు జైలు సూపరింటెండెంట్ మిశ్రా మీడియాకు తెలిపారు. మాయ చీటింగ్ కేసులో శిక్ష పడి జైలుకు వచ్చేనాటికి 7 నెలల ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. మంచి ఫుడ్ అందజేస్తూ ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేయించామన్నారు. 20 రోజుల కిందే ఆమెకు పండంటి బిడ్డ పుట్టగా మంగళవారం ఆస్పత్రి నుంచి సెల్‌కు తీసుకువచ్చి వేడుక నిర్వహించామన్నారు. కాగా, ఓ ఖైదీ బిడ్డకు ట్వంటీ ఫస్ట్ డే వేడుకను జైల్లో సెలబ్రేట్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.