ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట .. 12 కేసుల్లో బెయిల్

 ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట ..  12 కేసుల్లో బెయిల్

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది.  గతేడాది సైనిక స్థావరాలపై  దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది.  ఈ కేసులలో నిందితులు అందరూ బెయిల్‌పై ఉన్నందున ఖాన్‌ను జైల్లో ఉంచడం సమర్థనీయం కాదని ఈసందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 

ఈ కేసులో అరెస్టయిన పీటీఐ అధినేతకు రూ.5 లక్షల పూచీకత్తుపై ఏటీసీ జడ్జి మాలిక్ ఇజాన్ అసిఫ్ బెయిల్ మంజూరు చేశారు.   పాక్ సైనిక జనరల్ ప్రధాన కార్యాలయాలు, ఆర్మీ మ్యూజియమ్‌పై దాడి సహా 12 కేసుల్లో మాజీ ప్రధానికి బెయిల్ లభించినట్టు పాక్ మీడియా పేర్కొంది.  ఇదే కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా 13 కేసుల్లో బెయిల్ మంజూరైంది. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇమ్రాన్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తోషఖానా, అధికారిక రహస్యాల లీక్ కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 

ఇదిలాఉంటే ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు  పాక్ ఎన్నికల్లో రాణించిన నేపథ్యంలో  ఈ తీర్పు రావడం  ప్రాధన్యం సంతరించుకుంది.  గతేడాది అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కాగా  ఆయన మద్దతుదారులు మే 9న దాడులకు దిగి భవనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనలపై ఇమ్రాన్‌ సహా 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.