- జైనథ్లో వెలిసిన లక్ష్మీనారాయణ స్వామి
- భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి
- నల్లరాతి కట్టడాలతో శిల్పకళావైభవం
- నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఆదిలాబాద్, వెలుగు: దేశంలోనే అతి ప్రాచీనమై ఆలయాల్లో ఒకటైన ఆదిలాబాద్జిల్లా జైనథ్లోని లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసంలో ఏటా ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 16 వరకు ఉత్సవాలు జరుగుతాయి. జిల్లాతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టమైన రథోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు.
అద్భుతమైన శిల్పకళా సంపద
లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని రాక్షసులు రాత్రికి రాత్రే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం జైన సంప్రదాయ పద్ధతిలో ఉండటం గుడి ఉన్న ఈ గ్రామానికి జైనథ్ అని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 60 గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో అష్ఠాకోణాకార మండపంతో.. అద్భుతమైన శిల్పకళా సంపదతో కనువిందు చేస్తుంది ఈ ఆలయం. విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించారు.
ఆరడుగుల ఎత్తులో దివ్యరూపంతో కొలువుదీరిన స్వామి మూలవిరాట్టుకి దక్షిణ దిశలో లక్ష్మీదేవి ఉంటుంది. మండపం లోపల అనంత పద్మనాభ స్వామి, చెన్నకేశవుడు, గధాదరుడు, హక్ష్మీగ్రీవుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. ఆలయం ముందు గరుడ స్తంభం, అంతర్భాగంలోని స్తంభాలపై హనుమంతుడి విగ్రహం కనిపిస్తాయి. ఆలయం ప్రాంగణంలో గణపతి, ఆదిశేషుడు శివలింగం, మహానంది విగ్రహాలు దర్శనమిస్తాయి.
సంతాన నారాయణుడిగా..
ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి ఆలయంలోసామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. సంతానం లేని వారు భక్తితో స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రంలోని లక్ష్మీనారాయణుడు సంతాన నారాయణుడిగా పేరుపొందారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ప్రసాదం( గరుడ ముద్ద) స్వీకరిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం.
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కార్తీక బహుళపంచమి నాడు రాత్రి నిర్వహించే నాగవెల్లి పూజ సమయంలో భక్తితో స్వామివారిని తలుచుకొని, స్వామి వారి ముందర ఉంచిన పూల దండను ధరిస్తే కూడా సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.
సూర్యనారాయణుడిగా..
దసరా తర్వాత వచ్చే అశ్వయూజ పౌర్ణమి రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపైన పడుతాయి. అందుకే లక్ష్మీ సూర్యానారయణుడిగా పిలుస్తారు. సూర్యకిరణాలు పడే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
ఇలా వెళ్లాలి..
ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా 315 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం గుండానే ఈ ఆలయానికి చేరుకోవాలి. ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి జైనథ్, బేల బస్సులు అందుబాటులో ఉంటాయి.
