భారత్ జోడో యాత్రతోనే .. తెలంగాణలో పుంజుకున్నం: జైరాం రమేశ్

భారత్ జోడో యాత్రతోనే .. తెలంగాణలో పుంజుకున్నం: జైరాం రమేశ్
  • ఆ 12 రోజుల యాత్ర ఈక్వేషన్లు మార్చింది: జైరాం రమేశ్​
  • రాష్ట్రంలో రైతులే కాదు.. నిరుద్యోగులూ చనిపోతున్నరు
  • మోదీ ఓకే అన్నాకే ఈసీ రైతుబంధుకు అనుమతిచ్చింది
  • దాని ఎఫెక్ట్ ఎన్నికలపై ఉండదు.. కౌలు రైతులకు అది అందట్లేదు
  • ‘వెలుగు’తో ఇంటర్వ్యూలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు: రాహుల్ భారత్​జోడో యాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్​ బలం పుంజుకుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ జైరాం రమేశ్ అన్నారు. దాదాపు 12 రోజుల పాటు సాగిన యాత్రతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయన్నారు. ఒక జిల్లాను ఏర్పాటు చేసి దానికి పీవీ నర్సింహారావు పేరు పెడతామన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఐటీ, ఈడీలను కాంగ్రెస్ నేతలపైకి కేంద్రం పంపుతున్నదని ఆరోపించారు. ఎన్నికలున్న చోటల్లా వాటిని బీజేపీ పావులా వాడుకుంటున్నదని ఆరోపించారు. ‘వెలుగు’కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..

ప్రశ్న: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నాయి. వాటిని నిలువరించడంలో కేసీఆర్ ఫెయిలయ్యారని అంటున్నారు? మోదీ కూడా ఈ విషయంలో ఫెయిలయ్యారని ఆరోపిస్తున్నారు. మరి, మీరు అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారు? ఆత్మహత్యలు ఎట్లా తగ్గిస్తారు? 
జైరాం: రాష్ట్రంలో రైతులొక్కరే ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. యువత కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా మంది ఉద్యోగాలు లేక ప్రాణాలు వదులుతున్నారు. రైతులకు రైతు భరోసా స్కీమ్​ కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తాం. కౌలు రైతులకూ అది వర్తిస్తుంది. వరికి క్వింటాల్​కు రూ.వంద బోనస్​ ఇస్తాం. రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తాం. వడ్డీ లేకుండా రూ.3 లక్షలవరకు రుణాలిస్తాం. ఇవన్నీ రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తాం. విపత్తులు వచ్చి పంటలు నష్టపోతే పంటలబీమా పథకాన్ని మేం అమలు చేస్తాం. మోదీ మాత్రం రైతులకు రుణాలను మాఫీ చేయడం లేదు. 

ప్రశ్న:  రైతుబంధు పథకం పైసలు వేయొచ్చని రాష్ట్ర సర్కారుకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది? ఇది ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా?

జైరాం: బీఆర్ఎస్​కు బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తున్నది. ఆ క్రమంలోనే రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు అనుమతిచ్చేలా బీజేపీ ప్రభుత్వం ఈసీని ఒప్పించింది. ప్రధాని చెప్పిందే ఎన్నికల కమిషన్​ చేస్తుంది. రైతుబంధు కేవలం కొందరికి వర్తిస్తున్నది. కౌలు రైతులకు ఇది వర్తించట్లేదు.
ప్రశ్న:  గెలిచాక చాలా మంది కాంగ్రెస్​ నేతలు బీఆర్​ఎస్​లోకి పోతారని బీజేపీ నేతలు అంటున్నారు?
జైరాం: ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం ఆయనకు అలవాటే. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 
ప్రశ్న: ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో ముస్లిం క్యాండిడేట్లకు కాకుండా బీసీ లీడర్లకు ఇచ్చారన్న అపవాదున్నది. అలాంటి చోట్ల ఎంఐఎంను అడ్డుకుంటామన్న నమ్మకం మీకుందా?
జైరాం: ఎంఐఎం.. బీజేపీ, బీఆర్ఎస్​లను బలపరిచేందుకే ప్రయత్నిస్తున్నది. మూడు పార్టీలు ఒక్కటే. వాటి మధ్య పొత్తు లేనప్పటికీ.. చీకటి ఒప్పందం మాత్రం జరిగింది. బీజేపీ, ఎంఐఎం కావాలని ఓట్ల పోలరైజేషన్​కు ప్రయత్నిస్తున్నాయి. మత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాంగ్రెస్​ఓట్​షేర్​ను తగ్గించేందుకే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. 

ప్రశ్న: రాష్ట్రంలో కాంగ్రెస్​ పని దాదాపు అయిపోయిందనుకున్న టైంలో పార్టీ బాగా పుంజుకున్నది. కారణం ఏమై ఉంటుందంటారు?

జైరాం: రాహుల్ భారత్​ జోడో యాత్రతోనే రాష్ట్రంలో కాంగ్రెస్​ బలపడింది. చాలా జిల్లాల్లో ఆయన భారత్​ జోడో యాత్ర ద్వారా తన సందేశాన్ని వినిపించారు. అది భారీగా ప్రభావం చూపించింది. రాష్ట్రంలో దాదాపు 12 రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగింది. అదే తెలంగాణ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. 

ప్రశ్న:  తెలంగాణ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా?
జైరాం: ప్రస్తుతానికి ఎన్నికలను అసెంబ్లీ వరకే పరిమితం చేద్దాం. ఇక్కడ మా టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్. బీజేపీ సెకండరీ. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా లేదా అన్నది అప్రస్తుతం. 

ప్రశ్న: కాంగ్రెస్ వాళ్లపై కావాలని ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి కదా? వివేక్ వెంకటస్వామి సహా చాలా మంది మీద దాడులు చేశారు?
జైరాం: ఈడీ, ఐటీలు కేంద్రానికి తొత్తులు కదా. నాకు మంచి మిత్రుడైన వివేక్ వెంకటస్వామి సహా కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు, నేతలపై దాడులు చేస్తున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా వాటిని పావులుగా వాడుకుంటున్నారు. 

ప్రశ్న: పీవీ నర్సింహారావు మృతదేహాన్నీ ఏఐసీసీ హెడ్​క్వార్టర్స్​లోకి రానివ్వలేదన్న అపవాదు సోనియా గాంధీపై ఉంది? కానీ, ఇప్పుడు మీరే పీవీ నర్సింహారావు పేరిట జిల్లా ఏర్పాటు 
చేస్తామంటున్నారు?
జైరాం: పీవీ నర్సింహారావు విషయంలో కొన్ని తప్పులు జరిగాయన్నది నిజమే. వాటిని ఎప్పటి నుంచో సరిదిద్దుకుంటున్నాం. అందులో భాగంగా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాం. జిల్లాను హైదరాబాద్ లా అభివృద్ధి చేస్తాం. దానిని మేనిఫెస్టోలో కూడా పెట్టాం. కచ్చితంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కేలా చూస్తాం. ఆయన గొప్ప ఆర్థికవేత్త. ఆయన తెచ్చిన సంస్కరణల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉన్నది.

బీఆర్ఎస్ పాలనలో  అప్పుల కుప్పగా తెలంగాణ

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మండిపడ్డా రు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీ లను ఇస్తూ కేసీఆర్ రెండుసార్లు అధికారంలో కి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యం లో సోమవారం హైదరాబాద్​లోని సోమాజీ గూడ ప్రెస్​క్లబ్​లో జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ మాయమాటలకు కాలం చెల్లిపోయిందని, ఈ సారి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు సంసిద్ధమయ్యారని తెలిపారు.

నవంబర్ 30న వేసే ఓటు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, దేశంలో కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్ లతో పాటు మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కొనసాగుతాయని తెలిపారు.