జైషే చీఫ్ మసూద్ చరిత్ర ఇది

జైషే చీఫ్ మసూద్ చరిత్ర ఇది

పది మంది మంచి కోసం ఒక చెడ్డవాణ్ని శిక్షించినా తప్పులేదన్నది సాధారణ నీతి. పాకిస్థాన్ విషయంలో మాత్రం దీన్ని రివర్స్ లో చదువుకోవాలి. భయానక దాడులతో వందల మందిని పొట్టనపెట్టుకున్న మౌలానా మసూద్ అజర్ ను పాక్ ప్రభుత్వమే కాపాడుతున్నది. పుల్వామా అటాక్ పై ఇండియా సమర్పించిన సాక్ష్యాలు పరిశీలించకుండానే జైషే మహ్మద్ కు క్లీన్ చిట్ ఇచ్చేసింది. పార్లమెంట్, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి కేసుల్లోనూ ఇదే జరిగింది. తాము కూడా టెర్రర్ బాధితులమేనని చెప్పుకొనే పాకిస్థాన్‌‌ ఒక మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్టు కోసం ఎందుకింత రిస్క్​ చేస్తున్నట్లు? మసూద్ ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటిస్తే చైనాకు వచ్చే ఇబ్బందులేంటి ? అసలు అజర్ కు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు?


అసలెవరీ అజర్ ?

జైషే చీఫ్, 50 ఏండ్ల మసూద్ అజర్ ప్రస్తుతం కిడ్నీ వ్యాధి తో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉన్నాడని పాక్ మంత్రులు చెబుతున్నారు. రావల్పిండిలోని ఆర్మీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ నడుస్తున్నట్లు లీకులూ ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఒక్క మసూద్ పై తప్ప మిగతా టెర్రరిస్టు లీడర్ల విషయంలో ఇలాంటి పకడ్బందీ ప్రకటనలు దాదాపు వినిపించవు. మసూద్ ను మాత్రమే పాక్ సర్కారు స్పెషల్ గా ఎందుకు ట్రీట్ చేస్తుందో తెలియాలంటే అతని పుట్టుక నుంచి మొదలుపెట్టాలి . మసూద్ పుట్టింది1968 పంజాబ్ రాష్ట్రం భవల్పూర్ లో. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకే అయినా 8వ తరగతితోనే రెగ్యులర్ స్టడీస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇస్లామిక్ స్కూల్ బాట పట్టాడు. కరాచీలోని ‘జామియా ఉలూమ్ ఉల్ ఇస్లామియా’ స్కూల్లో చదివిన మసూద్ , 1989 నాటికి గ్రాడ్యుయేషన్ పట్టా సాధించి, అదే స్కూల్లో ‘ఆలిమ్ లేదా ఉలేమా’ హోదాలో ఉద్యోగంలో చేరాడు. అతను చదివిన, పనిచేసిన ‘జామియా ఉలూమ్ ఇస్లామియా(జేయూఐ)’ సంస్థ పాకిస్థాన్ లోనే అత్యంత శక్తిమంతమైన మత సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ప్రస్తుతం మనుగడ సాగిస్తోన్న దాదాపు అన్ని టెర్రరిస్టు గ్రూపుల మూలాలు జేయూఐలోనే లభిస్తాయంటే అతిశయోక్తికాదు.

టెర్రర్ సంస్థలకు తండ్రి
అఫ్ఘాన్–సోవియెట్ వార్ ముగిసిన తర్వాత హర్కతుల్ సంస్థ జమ్మూకాశ్మీర్ లో కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఆసమయంలో మసూద్ , అల్ ఖైదాతో కలిసి పనిచేశాడు. సోమాలియా, నైజీరియా తదితర ఆఫ్రికా దేశాల్లో ఇస్లామిస్ట్​ గ్రూపుల ఏర్పాటులో మసూద్ ది కీలక పాత్ర. మోటివేటర్ గానే కాక ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షకుడిగానూ బాధ్యతలు నిర్వహించేవాడు. బ్రిటన్ , పోర్చుగల్ తదితర యూరప్ దేశాలకు వెళ్లి అక్కడి సానుభూతిపరుల నుంచి నిధులు సేకరించేవాడు. హర్కతుల్ జమ్మూకాశ్మీ ర్ విభాగం నేతలకు, జేయూఐ మతపెద్దలకు మధ్య తలెత్తిన విభేదాల్ని పరిష్కరించేందుకు మసూద్ తొలిసారి1994లో ఇండియాకు వచ్చాడు . పోర్చుగల్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా కాశ్మీర్ కు వచ్చిన మసూద్ , సహచరులతో కలిసి అనంతనాగ్ సిటీలో ఆటోలో ప్రయాణిస్తుండగా ఆర్మీకి దొరికిపోయాడు. రెండు ఖండాల్లో టెర్రర్ గ్రూపులకు తండ్రిలాంటి మసూద్ అరెస్టు వార్త జిహాదీల్లో కలకలం రేపింది. మసూద్ విడుదల కోసం హజ్రతుల్ ముజాహిద్దీన్ భారీ ప్రయత్నాలెన్నో చేసింది. చివరికి 1999 డిసెంబర్ లో ‘కందహార్–ఢిల్లీ’ ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజార్ ను విడిపించుకున్నారు. 2000లో జైషే మహ్మద్ పేరుతో సొంత సంస్థను స్థాపించాడు.

చైనా ఆరాటం ఇందుకే..
ఉపఖండంతోపాటు మిడిల్ ఈస్ట్​, ఆఫ్రికాల్లోని టెర్రరిస్టు గ్రూపులు మసూద్ అజర్ ఎలా చెబితే అలా నడుచుకుంటాయి. విదేశాల నుం చి నిధులు రాబట్టడంలో ప్రస్తుతానికి అతణ్ని మిం చినోళ్లు లేరు. ఉలేమా హోదాలో స్వదేశంలో అతనిది గురుస్థానం. బేసిగ్గా ఇస్లామిక్ దేశమైన పాక్ లో ఆర్మీ , బ్యూరోక్రాట్స్ మద్దతు కూడా మసూద్ ను మరింత బలవంతుణ్ని చేశాయి. అంత పవర్ ఫుల్ వ్యక్తి కాబట్టే మసూద్ మెప్పు కోసం చైనా వెంపర్లాడుతున్నది. ఆ దేశం కొన్నేళ్లుగా పాకిస్థాన్, ఆఫ్రికా దేశాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. అవి నిరాటంకంగా సాగాలంటే అక్కడి ప్రభుత్వాలతోకంటే టెర్రరిస్టు గ్రూపులతో సయోధ్య అత్యంత కీలకం. ఆ పనిచేసిపెట్టగల వ్యక్తి మసూద్. అందుకే పాకిస్థాన్
ప్రభుత్వం విఫలమైన ప్రతిసారి మసూద్ ను కాపాడే బాధ్యతను చైనా తీసుకుంటున్నది.

హర్కతుల్ ముజాహిద్దీన్ తో..
అఫ్ఘానిస్థాన్ పై సోవియెట్ ఆక్రమణను నిరసిస్తూ జిహాదీ పోరాటమే లక్ష్యంగా 1980లో ‘హర్కతుల్ ముజాహిద్దీన్’ సంస్థ ఏర్పాటైంది. పాక్ గడ్డపై పుట్టిన ఈ హర్కతుల్ ముజాహిద్దీన్ నుంచే అనంతర కాలంలో అల్ ఖైదా సహా మరెన్నో టెర్రరిస్టు గ్రూపులు పుట్టుకొచ్చాయి. హర్కతుల్ ను స్థాపించిన ఫజ్లుర్ రహమాన్ ఖలీల్, జేయూఐలో మసూద్ కు సీనియర్ . అఫ్ఘాన్ –సోవియెట్ యుద్ధం తారా స్థాయికి చేరిన సమయంలో మసూద్ అజర్ ఉద్యోగం వదిలేశాడు. జిహాదీ ట్రైనింగ్ పూర్తి కాక ముందే అఫ్ఘాన్ వార్ ఫీల్డ్​లోకి వెళ్లడంతో గాయపడ్డాడు. దీంతో సంస్థ అతణ్ని ట్రైనర్ విధుల్లోకి పంపింది. యువకుల్ని మోటి వేట్ చేసి జిహాదీలుగా మార్చడం మసూద్ ప్రధాన విధి. ఆ పనిలో సూపర్ సక్సెస్ సాధించడంతో ఆర్గనైజేషన్ లో ముఖ్యుడిగా ఎదిగాడు.