ట్రంపువి అన్నీ ఉట్టిమాటలే..కాల్పుల విరమణకు..ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌కు సంబంధం లేదు:జైశంకర్

ట్రంపువి అన్నీ ఉట్టిమాటలే..కాల్పుల విరమణకు..ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌కు సంబంధం లేదు:జైశంకర్
  • కాల్పుల విరమణకు, ట్రేడ్ డీల్‌‌‌‌కు సంబంధం లేదు: జైశంకర్ 

న్యూయార్క్: ట్రేడ్ డీల్ చేసుకోబోమని బెదిరించి భారత్, పాక్​ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని విదేశాంగ మంత్రి ఎస్‌‌‌‌.జైశంకర్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి.. ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌కు సంబంధమే లేదన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన జైశంకర్.. న్యూయార్క్‌‌‌‌లో న్యూస్‌‌‌‌ వీక్‌‌‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి జరిగిన చర్చలను వివరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మే 9న ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. అప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను. భారత్‌‌‌‌పై పాక్ పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని వాన్స్ చెప్పారు. అయితే దానికి దీటుగా బదులిస్తామని మోదీ తెలిపారు. అదేరోజు రాత్రి మాపై పాక్ దాడి చేసింది. 

మేం దానికి దీటుగా బదులిచ్చాం. ఆ తెల్లారి అమెరికా, భారత విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాకు ఫోన్ చేసి చెప్పారు. 

అనంతరం పాక్ మిలటరీ ఆపరేషన్స్ డీజీ మేజర్ జనరల్ ఖసిఫ్ అబ్దుల్లా.. ఇండియన్ మిలటరీ ఆపరేషన్స్ డీజీ రాజీవ్ ఘాయ్‌‌‌‌కి ఫోన్ చేశారు. కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాతే మేం కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం” అని వెల్లడించారు.