బషీర్ బాగ్, వెలుగు : కామారెడ్డి డిక్లరేషన్ప్రకారం తక్షణమే కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు.
జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కులగణన చేపట్టాలని డిమాండ్చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కులగణన కోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బీసీ జాతి అస్తిత్వం కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు.
బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ఈనెల 22న హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. 26న కలెక్టరేట్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెల 6న ‘హలో బీసీ చలో బీసీ’ పేరుతో కులగణన మార్చ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
