పాలు అమ్ముకునే మల్లారెడ్డి 32 కాలేజీలు ఎలా పెట్టారు

పాలు అమ్ముకునే మల్లారెడ్డి 32 కాలేజీలు ఎలా పెట్టారు

ఖైరతాబాద్, వెలుగు: మంత్రి మల్లారెడ్డి అక్రమ ఆస్తులపై హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌లో ఆ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఇంటిపై రెండ్రోజులు జరిగిన ఐటీ దాడులపై రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. అవినీతికి పాల్పడే వాళ్లపై కచ్చితంగా ఐటీ దాడులు చెయ్యాల్సిందేనన్నారు. మల్లారెడ్డి మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆస్తులు పెంచుకున్నారని, పాలు అమ్ముకునే మల్లారెడ్డి 32 కాలేజీలు ఎలా పెట్టారని ప్రశ్నించారు. 

విద్యతో పేదలను దోచుకున్న చరిత్ర ఆయనదని విమర్శించారు. ఆకాశ రామన్న ఉత్తరాలకు స్పందించిన సీఎం కేసీఆర్.. మల్లారెడ్డి అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి విద్యాసేవ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కట్టిన ఫీజులను వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేశారు.