James Anderson: ఇతనికి వయసు నెంబర్ మాత్రమే: 42 ఏళ్ళ వయసులో లెజెండరీ పేసర్ కళ్లుచెదిరే డెలివరీ

James Anderson: ఇతనికి వయసు నెంబర్ మాత్రమే: 42 ఏళ్ళ వయసులో లెజెండరీ పేసర్ కళ్లుచెదిరే డెలివరీ

ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా అతనిలో బౌలింగ్ పదును మాత్రమే ఏ మాత్రం తగ్గలేదు. 40 ఏళ్ళ దాటినా ఫామ్ లో ఉన్నపటికీ ఇంగ్లాండ్ క్రికెట్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత అండర్సన్ పని అయిపోయిందనుకున్నారు. కానీ ఈ దిగ్గజ పేసర్ కు క్రికెట్ మీద మమకారం చావలేదు. అవకాశం వచ్చిన ప్రతి టోర్నీ ఆడతానని ప్రకటించాడు. ఇంగ్లాండ్ లో జరగబోయే హండ్రెడ్ లీగ్.. ఐపీఎల్ లో ఆడతానని ప్రకటించినా దురదృష్టవశాత్తు అండర్సన్ ను ఎవరూ తీసుకోలేదు.

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన 10 నెలల తర్వాత ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఆడుతున్న అండర్సన్ తనలోని బౌలింగ్ స్కిల్ ను మరోసారి బయట పెట్టాడు.  మే 17న కౌంటీ క్రికెట్‌లో లాంక్షైర్ తరపున ఆడుతున్న ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ మే 17 న డెర్బీషైర్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టి తాను ఇంకా ఫామ్ లో ఉన్నానని నిరూపించాడు. కొత్త బంతితో డెర్బీషైర్ ఓపెనర్ల వికెట్లను పడగొట్టిన అండర్సన్.. తొలి ఇన్నింగ్స్ లో 12 ఓవర్లలో 52 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

ALSO READ | IPL 2025: ప్లే ఆఫ్స్‪కు సౌతాఫ్రికా పేసర్ ఔట్.. జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌తో RCB ఒప్పందం

ఈ మ్యాచ్ లో అండర్సన్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీకి కాలేబ్ జ్యువెల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆఫ్ స్టంప్ మీద వేసిన ఈ డెలివరీ అనూహ్యంగా లోపలకి తిరి వికెట్లను గిరాటేసింది. అండర్సన్ వేసిన ఈ బంతి మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ఈ బాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు చేసింది. ల్యూక్ వెల్స్ 141 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన డెర్బీషైర్‌ అండర్సన్ బౌలింగ్ లో రాణించడంతో 314 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో లంకాషైర్ కు 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.  

2002 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా అండర్సన్ నిలిచాడు. అంతక ముందు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800), ఆస్ట్రేలియా దివంగత షేన్ వార్న్ (708 వికెట్లు) ఈ లిస్ట్ లో ఉన్నారు. ఒక ఫాస్ట్ బౌలర్ గా ఈ ఫీట్ అందుకున్న తొలి బౌలర్ గా అండర్సన్ రికార్డుల్లో నిలిచాడు. టెస్టుల్లో స్వింగ్ కింగ్ గా పేరొందిన ఈ ఇంగ్లీష్ పేసర్ 2003లో జింబాబ్వేతో లార్డ్స్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 187 టెస్టుల్లో 27 యావరేజ్ తో మొత్తం 32 సార్లు 5 వికెట్లను పడగొట్టాడు.