IPL 2025: ప్లే ఆఫ్స్‪కు సౌతాఫ్రికా పేసర్ ఔట్.. జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌తో RCB ఒప్పందం

IPL 2025: ప్లే ఆఫ్స్‪కు సౌతాఫ్రికా పేసర్ ఔట్.. జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌తో RCB ఒప్పందం

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక రీప్లేక్ మెంట్ ప్రకటించింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీని జట్టులోకి తీసుకుంది. సోమవారం (మే 19) RCB యాజమాన్యం లుంగీ ఎంగిడి స్థానంలో ముజారబానీతో ఒప్పందం చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. రూ.75 లక్షలకు ముజారబానీ ఆర్సీబీ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు ఎంగిడి అందుబాటులో ఉండడం లేదు. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఉండడంతో ఎంగిడి లీగ్ మ్యాచ్ ల వరకు అందుబాటులో ఉండనున్నాడు.

ALSO READ | IPL 2025: టైటిల్ మనదే.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి: RCBకి డివిలియర్స్ కీలక సలహా

ముజారబానీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ కుడిచేతి వాటం పేసర్ ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పటివరకు జింబాబ్వే తరపున 70 టీ20లు మ్యాచ్ లు ఆడి 78 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టీ20 లీగ్ ల్లో ఎన్నో మ్యాచ్ లు ఆడిన ఈ జింబాబ్వే పేసర్ కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం. 6.8 అడుగుల ఎత్తు ఉన్న ముజారబానీ స్లో బంతులతో పాటు యార్కర్లు వేయడంలో దిట్ట. ఇటీవలే బీసీసీఐ తాత్కాలిక రీప్లేస్ మెంట్ లు చేసుకోమనడంతో ఆర్సీబీ చేసుకున్న తొలి రీప్లేస్ మెంట్ ఇదే.

ఎంగిడితో పాటు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్ స్వదేశానికి వెళ్లనున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఉండడంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్లే ఆఫ్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నారు. బెతేల్ కు త్వరలో రీప్లేక్ మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ మినహాయిస్తే మిగిలిన అందరూ ఆర్సీబీకి అందుబాటులో ఉంటారు.ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆదివారం (మే 18) ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో వరుసగా రెండో సారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. 

ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన పటిదార్ సేన మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే టాప్ 2 లో నిలుస్తుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. మే 23 న సన్ రైజర్స్ హైదరాబాద్‎తో.. మే 27 న లక్నో సూపర్ జయింట్స్‎తో తలపడనుంది.