V6 News

చావడానికైనా సిద్ధం కానీ వందేమాతరం మొత్తం పాడం: జమియత్ ఉలేమా-ఇ-హింద్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

చావడానికైనా సిద్ధం కానీ వందేమాతరం మొత్తం పాడం: జమియత్ ఉలేమా-ఇ-హింద్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చ నిర్వహిస్తోన్న వేళ జాతీయ గీతంపై జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు చావడానికైనా సిద్ధమే కానీ.. వందేమాతరం పూర్తి వెర్షన్‎ను మాత్రం పాడారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ముస్లింలు వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పఠించలేరు.. ఎందుకంటే ఆ గీతంలోని కొన్ని చరణాలు ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయి. వందేమాతరంలోని కొన్ని చరణాలు దేశాన్ని దుర్గా మాత రూపంలో అభివర్ణిస్తాయి. 

ఆరాధనతో ముడిపడి ఉన్న వ్యక్తీకరణలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధం. మేము మరణాన్ని అయినా అంగీకరిస్తాం. కానీ అల్లాను తప్ప మరెవరినీ పూజించం” అని మదానీ అన్నారు. భారత పౌరులను తమ నమ్మకాలకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పమని లేదా పాడమని బలవంతం చేయకుండా రాజ్యాంగంలోని  ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ), ఆర్టికల్ 19 (భావ ప్రకటనా స్వేచ్ఛ) కాపాడుతుందని నొక్కి చెప్పారు. 

ఏ పౌరున్ని కూడా తమ విశ్వాసాన్ని ఉల్లంఘించే పాటను పాడమని బలవంతం చేయరాదనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా మదానీ గుర్తు చేశారు. వందేమాతరాన్ని రాజకీయ అంశంగా మార్చకుండా.. రాజ్యాంగ హక్కులు, పరస్పర గౌరవ పరిమితుల్లోనే ఉండాలని మదానీ అన్నారు. 1937లో రవీంద్రనాథ్ ఠాగూర్ జవహర్‌లాల్ నెహ్రూకు వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గీతంగా అంగీకరించాలని సలహా ఇచ్చారని.. ఎందుకంటే మిగిలిన చరణాలు ఏకేశ్వరోపాసన మతాలకు విరుద్ధంగా ఉండవచ్చని చెప్పారని గుర్తు చేశారు.

ఈ సిఫార్సు ఆధారంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గీతంగా ఆమోదించిందన్నారు. దేశం పట్ల ప్రేమ, ఆరాధన రెండు వేర్వేరు విషయాలని అన్నారు. ముస్లింలు భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని.. వారికి  ఎవరి నుంచి దేశభక్తికి సంబంధించిన సర్టిఫికెట్లుఅవసరం లేదని వ్యాఖ్యానించారు.