పోటెత్తిన మక్కలు.. మూతపడ్డ యార్డు.. జమ్మికుంట మార్కెట్లో పేరుకుపోయిన 40 వేల బస్తాలు

పోటెత్తిన మక్కలు.. మూతపడ్డ యార్డు.. జమ్మికుంట మార్కెట్లో పేరుకుపోయిన 40 వేల బస్తాలు

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌‌లో మోతాదుకు మించి మక్కలు రావడంతో అధికారులు యార్డును తాత్కాలికంగా మూసివేశారు. జమ్మికుంటతో పాటు పరిసర మండలాల రైతులు ఇప్పటికే 40 వేల బస్తాలకు పైగా మక్కలను తీసుకురాగా, కాంటాలు పూర్తయినా హమాలీల కొరత వల్ల లారీల్లో లోడింగ్ జరగడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం లోడింగ్ జరగకపోవడంతో రైతులు అధికారులను నిలదీశారు.

మార్కెట్‌‌లో ఇప్పటికే భారీగా నిల్వలు ఉండటంతో శుక్రవారం నుంచి తదుపరి ప్రకటన వచ్చే వరకు మక్కలు తీసుకురావద్దని అధికారులు ప్రకటించారు. గన్నీ సంచులు, గోదాముల కొరతతో రైతులు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్, ఏసీపీ మాధవి సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. జమ్మికుంటలో 750 మంది హమాలీలు ఉన్నప్పటికీ రోజూ 30 నుంచి 50 మంది మాత్రమే పనికి వస్తుండడంతో లోడింగ్, రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.