కాశ్మీర్ అడవుల్లో కొనసాగుతున్న తుపాకుల మోత

కాశ్మీర్ అడవుల్లో కొనసాగుతున్న తుపాకుల మోత
  • 14వ రోజులు గడచినా ఆగని కాల్పులు
  • ఎన్ కౌంటర్​లో ఇద్దరు పోలీసులు, సోల్జర్ కు గాయాలు 
  • జైలు నుంచి స్పాట్​కు తీసుకెళ్లిన టెర్రరిస్టు మృతి

జమ్మూ: కాశ్మీర్​లోని పూంచ్ జిల్లాలో వరుసగా 14వ రోజూ తూటాలు పేలాయి. భటాదురైన్ ఫారెస్ట్​లో మరోసారి భారీగా ఫైరింగ్, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆదివారం దట్టమైన అడవుల్లో టెర్రరిస్టుల కోసం ఆర్మీ, పోలీసు బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించగా టెర్రరిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లాలోని భటాదురైన్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఈ ఎన్ కౌంటర్​లో ఇద్దరు పోలీసులు, ఒక జవాన్ గాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి టెర్రరిస్టులు వచ్చిన రూట్​ను గుర్తించేందుకు జైలులో ఉన్న ఓ టెర్రరిస్టును స్పాట్​కు తీసుకుపోగా, కాల్పు ల్లో అతను మృతి చెందాడు. భటాదురైన్​తో పాటు సురాన్ కోటే, రాజౌరీ జిల్లాలోని తానామండి ఏరియాలోని అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సెర్చ్ ఆపరే షన్ జరుగుతుండగా ఈ నెల 11న సురాన్ కోటేలో, 14న మెందర్ ఫారెస్ట్ లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 9 మంది సోల్జర్లు అమరులయ్యారు.  
టెర్రరిస్ట్ ఖైదీ మృతి   
పాక్​లోని లష్కరే తాయిబాకు చెందిన జియా ముస్తఫా అనే టెర్రరిస్ట్ కూడా గతంలో పీవోకే నుంచి ఇప్పుడు టెర్రరిస్టులు దాగి ఉన్న అడవి ద్వారానే కాశ్మీర్​లోకి ఎంటరయ్యాడు. దీంతో అతను వచ్చిన రూట్ తెలుసుకుంటే టెర్రరిస్టుల స్థావరాన్ని గుర్తించవచ్చని భద్రతాబలగాలు అతడిని జైలు నుంచి వెంట తీసుకెళ్లాయి. టెర్రరిస్టులు దాగి ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లగానే అటువైపు నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయిందని, దీంతో ఆర్మీ, పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. భీకరంగా కాల్పులు జరగడంతో ముస్తఫా అక్కడే చిక్కుకుపోయాడని, బలగాలు కొద్దిదూరం వెనక్కి వచ్చాయని తెలిపారు. అక్కడి నుంచి టెర్రరిస్టులు పారిపోయాక వెళ్లి ముస్తఫా డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 
క్రాస్ ఫైరింగ్‌‌లో పండ్ల వ్యాపారి మృతి 
జమ్మూకాశ్మీర్ లోని సోపియాన్ జిల్లా బాబాపురాలో ఆదివారం టెర్రరిస్టులు, సీఆర్పీఎఫ్ ​జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ఓ పండ్ల వ్యాపారి మృతిచెందాడు. ఉదయం 10.30కు పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపైకి టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రాస్ ఫైరింగ్ లో చిక్కుకుని షహీద్ అహ్మద్ అనే యాపిల్ పండ్ల వ్యాపారి చనిపోయాడని పోలీసులు తెలిపారు.
ఒకట్రెండు రోజుల్లో ఆపరేషన్ క్లోజ్? 
రాజౌరి, పూంచ్ జిల్లాల పరిధిలో ఉన్న అడవులను డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో పూర్తిస్థాయిలో జల్లెడపడుతున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పారాకమెండోలను రంగంలోకి దించామని, పీవోకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొద్ది ప్రాంతం మాత్రమే ఇంకా మిగిలి ఉందన్నారు. ఇక్కడ ఉన్న కొండ గుహలను కూడా గాలిస్తే సెర్చ్ ఆపరేషన్ కంప్లీట్ అవుతుందన్నారు. మరో ఒకటి రెండురోజుల్లోనే ఈ ఆపరేషన్ ముగిసే చాన్స్ ఉందన్నారు.