
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పుడే తిరిగి ఇండ్లకు రావొద్దని జమ్మూకాశ్మీర్ పోలీసులు సూచించారు. పాకిస్తాన్ ప్రయోగించిన షెల్స్‌ను గుర్తించి ఆయా ప్రాంతాలను శానిటైజ్చేయాల్సి ఉందని, అప్పటి వరకు సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని కోరారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన తర్వాత నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాల్లోని 1.25 లక్షలకు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించారు.
అయితే శనివారం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ప్రజలు ఆయా గ్రామాలకు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు.. ప్రజలు ఇప్పుడే ఇండ్లకు రావొద్దని ఆదివారం సూచించారు. పాక్ ప్రయోగించిన షెల్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, అందులో ప్రాణనష్టానికి కారణమయ్యే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో అక్కడి నుంచి తొలగించి శానిటైజ్ చేస్తామని తెలిపారు.
లేదంటే ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చని పేర్కొన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను ఆయా ప్రాంతాలకు పంపి.. షెల్స్‌ను తొలగించిన తర్వాత ప్రజలను గ్రామాలకు అనుమతిస్తామని తెలిపారు. 2023లో ఎల్‌ఓసీ దగ్గర ఇలాగే మిగిలిపోయిన షెల్స్ పేలడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారని.. కాబట్టి, ప్రజలు ఇప్పుడే గ్రామాలకు తిరిగి రావొద్దని పోలీసులు సూచించారు.