కశ్మీరీలు.. మారుతున్నరు

కశ్మీరీలు.. మారుతున్నరు

కయ్యానికి కాలుదువ్వే జమ్మూకాశ్మీర్​ కుర్రోళ్లు ఈమధ్య మైండ్​సెట్ మార్చుకుంటున్నారు. తెల్లారితే చాలు.. ఎక్కడ గొడవ దొరికిద్దా అని వాళ్లు ఎదురుచూసిన రోజులు పోయాయి. మరీ ముఖ్యంగా మిలిటెంట్లతో చేతులు కలపాలనే ఆలోచనలను మానుకుంటున్నారు. ఈ మార్పు గత ఆగస్టు నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్పెషల్​ స్టేటస్​ రద్దు, యూటీల ఏర్పాటు మంచి ఫలితాలను ఇస్తున్నాయనటానికి, లా అండ్​ ఆర్డర్​ కంట్రోల్లో ఉందనటానికి ఇదో ఉదాహరణ. సెక్యూరిటీ ఏజెన్సీల లేటెస్ట్​ రిపోర్టు కూడా ఈ విషయాన్నే చెబుతోంది.

జమ్మూకాశ్మీర్​ సమస్యాత్మక ప్రాంతమనే ముద్ర క్రమంగా తొలిగిపోతోంది. అక్కడ ఈమధ్య కాలంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. లా అండ్​ ఆర్డర్​ చాలా వరకు అదుపులోకి వచ్చింది. సెక్యూరిటీ ఫోర్సెస్​, యూత్​ మధ్య గొడవలు తగ్గుముఖం పట్టాయి. రాళ్లు రువ్వటం, ఫైరింగ్​కి పాల్పడటం వంటివి బంద్​ అయ్యాయి. యువత అన్ని విధాలుగా సెట్​రైట్​ అవుతోంది. స్టడీ, కెరీర్​లపై దృష్టి పెడుతోంది. మిలిటెంట్ల అంత్యక్రియలకు పబ్లిక్​ పెద్ద సంఖ్యలో రావటం ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు.

సర్వరోగ నివారిణి

గతంలో కాశ్మీర్​లో రోజూ వయొలెన్స్​ చోటుచేసుకునేది. మిలిటెంట్లు, టెర్రరిస్టులు లోకల్​ యూత్​ని రెచ్చగొట్టేవారు.​ వాళ్ల చేతుల్లో తుపాకీలు పెట్టి, తెర వెనక ఉండి కథ నడిపేవారు.  ఆర్మీని, సెక్యూరిటీ ఫోర్సెస్​నీ లెక్కచేసేవారు కాదు. వాళ్లపైకి ఇష్టమొచ్చినట్లు రాళ్లు విసిరేవారు. దీంతో ఆ రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట ఎన్​కౌంటర్లు జరిగేవి. అటు అమాయక జనాలు, ఇటు జవాన్లు చనిపోయేవారు. చాలా మంది గాయాలపాలయ్యేవారు. పాకిస్థాన్​ సపోర్ట్​తో మిలిటెంట్లు, టెర్రరిస్టులు ఆ రాష్ట్రాన్ని టార్గెట్​ చేసుకునేవారు. దీంతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడేవి. పాలిటిక్స్​, ప్రభుత్వాలు నిలకడగా ఉండేవి కాదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే మోడీ సర్కారు జమ్మూకాశ్మీర్​కి సర్వరోగ నివారిణి లాంటి నిర్ణయాలు తీసుకుంది.

బాగా బుద్ధి చెప్పారు ​

జమ్మూకాశ్మీర్​లో ఉడుకు రక్తం ఉరకలెత్తే యువతని మిలిటెంట్లు, టెర్రరిస్టులు తమ వైపుకి లాక్కోవటానికి ముఖ్యంగా రెండు విధాలుగా ప్రయత్నించేవారు. కిడ్నాప్​ చేసి బెదిరించటం, కుటుంబ సభ్యులను బ్లాక్​ మెయిల్​ చేయటం మొదటి మార్గమైతే; సానుభూతిపరుల్లా మచ్చిక చేసుకొని తమ ముఠాల్లో కలిపేసుకోవటం రెండో రూటు. కిడ్నాప్​కి గురైనోళ్లతో ప్రాణాపాయంలో ఉన్నట్లు చెప్పించి, ఆ కాల్​ రికార్డింగ్స్​ని ఫ్యామిలీ మెంబర్స్​కి పంపేవారు. దీంతో వాళ్లు భయపడి మరింత మందిని ఆ గ్రూపుల్లో చేర్పించేవాళ్లు. పోయిన ఆగస్టులో జమ్మూకాశ్మీర్​ ప్రత్యేక హోదాను ఎత్తేశాక కమ్యూనికేషన్​ని కొన్నాళ్లు నిలిపేయటంతో మిలిటెంట్లు, టెర్రరిస్టులకు బ్లాక్​ మెయిల్​ ఛాన్స్​లు​ లేకుండా పోయాయి. దీనికితోడు అడుగడుగునా సెక్యూరిటీ ఫోర్సెస్​ను పెట్టి ఊరూపేరూ లేనోళ్లు ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో మిలిటెన్సీలోకి చేరికలు తగ్గాయి. 2019 ఆగస్టుకు ముందు.. నెలకు యావరేజ్​గా 14 మంది యువకులు టెర్రరిస్టులతో చేతులు కలిపితే ఆ తర్వాత అది ఐదుకు దిగొచ్చింది.

అంత్యక్రియలకు దగ్గరోళ్లే

గతంలో జమ్మూకాశ్మీర్​లో మిలిటెంట్ లేదా టెర్రరిస్టు​ చనిపోతే అంత్యక్రియలకు జనం భారీగా హాజరయ్యేవారు. ఒక్కోసారి పది వేల మంది వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. మిలిటెన్సీలోకి యూత్​ని రిక్రూట్​ చేసుకోవటానికి ఇలాంటివి ఎక్కువగా దారితీసేవి. చనిపోయినోడి​ కుటుంబం పట్ల సానుభూతి పెరిగేలా పెద్దలు స్పీచ్​లిచ్చి అక్కడికి వచ్చిన కుర్రకారుపై సెంటిమెంట్​ ప్రయోగించేవారు. ఇప్పుడు ఈ టైపు కార్యక్రమాలకు బంధువులు కొద్ది సంఖ్యలోనే వస్తున్నారు.

అవన్నీ ఇక గతమే

జమ్మూకాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​ని క్యాన్సిల్​ చేసిన మోడీ సర్కారు అదే సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగానూ చేసింది. ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు చేయిస్తారనుకున్న​ లీడర్లను ఇళ్లకు పరిమితం చేసింది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసి లా అండ్​ ఆర్డర్​ని కంట్రోల్లోకి తెచ్చుకుంది. దీంతో కుర్రోళ్లు రోడ్లపై రాళ్లతో వీరంగం వేయటం లాంటి వాటికి ఫుల్​ స్టాప్​ పడింది. టియర్​ స్మోక్​ సెల్స్​, పెల్లెట్​ గన్స్​కి పని తగ్గింది. ఎన్​కౌంటర్లకు ఎండ్​ కార్డ్​ పడింది. కాశ్మీర్​ కొత్త చరిత్రకు ఇవే సాక్ష్యాలంటూ సెక్యూరిటీ ఏజెన్సీలు రీసెంట్​గా రిపోర్ట్​ ఇచ్చాయి.