జమ్ము కశ్మీర్‌‌లో నియోజకవర్గాల పెంపు!

జమ్ము కశ్మీర్‌‌లో నియోజకవర్గాల పెంపు!

జమ్ము కశ్మీర్‌‌లో నియోజకవర్గాల పునర్విభజనపై నియమించిన డీలిమిటేష్ కమిషన్‌ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 83 నియోజకవర్గాలను  90కి పెంచాలని కమిషన్ తన ముసాయిదా నివేదికలో ప్రతిపాదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్తగా ఏడు నియోజకవర్గాల పెంచాలని కమిషన్ సూచించింది. జమ్ము పరిధిలో ఇప్పుడున్న 37 సీట్లకు అదనంగా మరో ఆరు, కశ్మీర్ పరిధిలో 46 సీట్లకు మరొకటి అదనంగా ఏర్పాటు చేయాలని పేర్కొందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే జమ్ములో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 43కు, కశ్మీర్‌‌లో 47కు చేరనున్నాయి. ఈ 90 సీట్లతో పాటు పీవోకేలో ఉన్న 24 సీట్లను అలాగే కొనసాగించాలని డీలిమిటేషన్ కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది.

తొమ్మిది సీట్లు ఎస్టీలకు, ఏడు సీట్లు ఎస్సీలకు..

గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్‌‌లో ఉన్న జిల్లాల సంఖ్య 12 నుంచి 20కి పెరగ్గా, తహసీల్‌లు 52 నుంచి 207కు పెరిగినట్లు డీలిమిటేషన్ కమిషన్ పేర్కొంది. జమ్ము కశ్మీర్‌‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది సీట్లను ఎస్టీలకు రిజర్వు చేయాలని సూచించింది. వారి జనాభా ఆధారంగా ఈ ప్రతిపాదన పెట్టినట్లు డీలిమిటేషన్ కమిషన్ పేర్కొంది. ఇక, ప్రస్తుతం ఉన్న మాదిరిగానే ఏడు సీట్లను ఎస్సీలకు రిజర్వు చేయాలని ప్రతిపాదించింది. కాగా, రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్‌ నేతృత్వంలోని ఈ డీలిమిటేషన్ కమిషన్‌కు తమ నివేదిక సమర్పించేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. ఈ కమిషన్ పలు మార్లు జమ్ము కశ్మీర్‌‌లో పర్యటించి.. సాధారణ ప్రజలు, పార్టీలు, సంస్థలు, రాజకీయ నేతలతో సమావేశమైంది. రకరకాల సంస్థల నుంచి 280 రెప్రజెంటేషన్లు, 900 మంది అభిప్రాయాలను కమిషన్‌కు అందాయి. డెడ్‌లైన్ కంటే ముందే నివేదిక రూపొందించిన డీలిమిటేన్ కమిషన్ ఇవాళ (సోమవారం) జమ్ము కశ్మీర్‌‌కు చెందిన ఎంపీలతో సమావేశమై ఆ రిపోర్ట్‌పై చర్చించింది. ఈ ముసాయిదా నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.