న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న భారత ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధమున్న డాక్టర్ ముజమ్మిల్ గనై దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
2026, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట దగ్గర భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారని.. అందులో భాగంగానే నిందితులు రెడ్ ఫోర్ట్ దగ్గర రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) నాడు ఎర్రకోటను లక్ష్యంగా చేసుకోవడం నిందితుల ప్రణాళికలో భాగమని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాకుండా.. దీపావళి సందర్భంగా రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని కూడా ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ ప్లాన్ చేసిందని అధికారులు గుర్తించారు.
ఎర్రకోట దగ్గర కారులో పేలిన బాంబు కూడా ప్రమాదవశాత్తూ పేలిందని ఇన్విస్టిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యుల్ సభ్యులు కొందరు అరెస్ట్ కావడంతో ఎక్కడా తాము దొరికిపోతామోనని భయంతో నిందితులు పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
పేలుడు పదార్థాలను ఐఈడీగా మార్చకముందే ఈ బ్లాస్ట్ సంభవించినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. ఈ దాడి వెనుక కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉందని కేంద్ర దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఆ కోణంలో దర్యాప్తు స్పీడప్ చేశాయి. ఇందులో భాగంగానే జైషే మహ్మద్ గ్రూప్‌తో సంబంధమున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.
