16న ఉదయం.. ఎక్కడి వారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన

 16న ఉదయం.. ఎక్కడి వారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మొత్తం 15 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆగస్టు 08వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనెల 08వ తేదీన సీఎం కేసీఆర్ వేడుకలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న ఉదయం 11గంటల 30 నిమిషాలకు జాతీయ గీతాలాపన నిర్వహించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే మంగళవారం ఉదయం ప్రభుత్వం చెప్పిన టైమ్ కు ఎక్కడివారు అక్కడే ఉండి జాతీయ గీతాలాపన చేయాలని ఆదేశించింది. కాగా, వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ 5 కె రన్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఈ రన్ జరిగింది. 

12న జాతీయ సమాఖ్య రక్ష బంధన్ నిర్వహిస్తారు. 13వ తేదీన ఎన్.సి.సి, స్కాట్స్ అండ్ గైడ్స్, విద్యార్థులు అధికారులు ప్ల కార్డులతో పాటు జాతీయ పతాకాలు పట్టుకుని ర్యాలీ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ట్రై కలర్ బెలూన్లను ఎగుర వేస్తారు. 14వ తేదీన జానపద కళాకారుల ప్రదర్శన జరుగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా ట్యాంక్ బండ్ పై బాణాసంచా కాల్చనున్నారు. 15వ తేదీ వేడుకలు ప్రధాన కార్యాలయాల్లో నిర్వహిస్తారు. సర్కిల్ వార్డు, జోనల్ స్థాయి, కాలనీల వారీగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. ఒకేసారి నిర్దేశించిన సమయంలో ఆలాపన జరుగనుంది. 17వ తేదీన రక్త శిబిరాలు నిర్వహిస్తారు. 18వ తేదీన ఫ్రీడమ్ కప్ క్రీడలు, 19వ తేదీన అధికారుల గ్రామాల పర్యటన, పేదలకు పండ్ల పంపిణీ. 20వ తేదీన రంగోలి, 21వ తేదీన సమావేశాలు, 22వ తేదీన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగనుంది.