తెలంగాణ బరిలో జనసేన నిలిచేనా?

తెలంగాణ బరిలో జనసేన నిలిచేనా?
  • తెలంగాణ బరిలో జనసేన నిలిచేనా?
  • ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్​ తలమునకలు
  • అక్కడి అధికార పార్టీ నేతలతో కౌంటర్ ఎటాక్స్
  • తెలంగాణలో బీజేపీతో సీట్ల సర్దుబాటు సాధ్యమా?
  • గతంలో 30 సీట్లలో పోటీ చేస్తామన్న జనసేనాని
  • రాష్ట్రంలో అన్ని సీట్లను బీజేపీ వదులుకుంటదా?
  • గందరగోళంలో గ్లాస్ పార్టీ కార్యకర్తలు

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు ప్రకటించిన జనసేనాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​ పాలిటిక్స్ కే పరిమితమం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ 30 మంది అభ్యర్థులను బరిలోకి దింపుతామని పవన్ గతంలో ప్రకటించారు. తన ప్రచార రథం వారాహికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత వాహనం రంగులో స్వల్ప మార్పులు చేసుకొని ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన జనసేనాని విజయవాడ కనకదుర్గ గుడిలో మరోమారు వాహనానికి పూజలు చేయించారు. ఆ తర్వాత అక్కడి పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు. ఏపీలో కొనసాగుతున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై ఇటీవల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత అక్కడి ముఖ్యమంత్రికి, మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల శ్రీకాళహస్తికి చెందిన జనసేన నాయకుడిపై సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ భారీ ర్యాలీగా వెళ్లి తిరుపతి ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ఎన్డీఏ పక్షాల మీటింగ్ కు హాజరయ్యారు. 

30 స్థానాల్లో పోటీ నిజమేనా..?

4 నెలల క్రితం మీరు కోరుకుంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. పార్లమెంటు స్థానాల్లోనూ బరిలోకి దిగుతామని చెప్పారు. తన ప్రచార రథం వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన సమయంలో అక్కడ నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదంతా నిజమే అని భావించిన జనసేన నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎన్నిపార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామనేది వెల్లడించలేదు. 

బీజేపీతో కలిసి బరిలోకి దిగుతుందా..?

ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా జనసేన కొనసాగుతున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల మీటింగ్ కు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పొత్తు తెలంగాణలో కొనసాగితే ఏకంగా 30 స్థానాలను బీజేపీ వదులుకుంటుందా..? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ తో నువ్వానేనా... అన్నట్టుగా బీజేపీ జర్నీ సాగుతున్నది. ఇప్పటికే ఏ సెగ్మెంట్ లో ఎవరిని బరిలోకి దించాలనేదానిపై కమలం పార్టీకి కొంత క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లాస్ పార్టీ ఎంట్రీ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. 30 సీట్లను ఎలా సర్దుబాటు చేస్తుందనే చర్చనడుస్తోంది. ఇప్పటి దాకా జనసేనానికి జై కొట్టిన అభిమానులు, పార్టీ కార్యకర్తల రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది అంతు చిక్కడం లేదు.