ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్​ జనగామ ఫారెస్ట్​ రేంజ్ ​ఆఫీసర్

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్​ జనగామ ఫారెస్ట్​ రేంజ్ ​ఆఫీసర్
  • ఫోన్​లో ఇద్దరి మధ్య మాటల వార్​  

  • ఎఫ్ఆర్ఓపై కలెక్టర్​కు, డీఎఫ్​ఓకు ఎమ్మెల్యే ఫిర్యాదు

జనగామ/ బచ్చన్నపేట, వెలుగు : ‘ఏయ్​ సక్కగ మాట్లడవయా.. ఎట్లున్నది నీకు’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫారెస్ట్​ రేంజ్​ఆఫీసర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొకదశలో ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే రేంజ్​లో ఎమ్మెల్యే, రేంజ్​ఆఫీసర్లు వాదులాడుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్లలో ఆదివారం కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఊరిలో కొండెంగ సమస్య ఉందని, పలువురిని కరుస్తుందని.. అయినా ఫారెస్ట్​ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.

దీంతో ఆయన జనగామ ఫారెస్ట్ రేంజ్​ఆఫీసర్ ​కొండల్​రెడ్డికి ఫోన్​చేసి లౌడ్ స్పీకర్​ ఆన్​ చేసి మాట్లాడారు. ‘ఊరోళ్లంతా నన్ను బొడ్రాయి కాడ కూసుండ బెట్టి సుట్టుముట్టిన్రు. గ్రామంలోకి చిరుత పులి వస్తే ఏం చేస్తరు’ అని అడిగారు. దీనికి కొండల్​రెడ్డి ‘దానిని ఊర్లో నుంచి వెళ్లగొట్టడమో లేక పట్టుకోవడమో చేస్తం’ అని చెప్పారు. ‘ఊళ్లకెళ్లి ఎల్లగొడితే ఏడికి పోతది..చుట్టుపక్కల అడవి, గుట్టలు ఏమన్నా ఉన్నయా. దాన్ని పట్టాల్సిందే కదా. చెప్పరూ పడ్తరా ఏం జేస్తరు’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​ కొండెంగ సమస్య ఉందని చెప్పబోయారు. ‘నేను అడిగేది చిరుతపులి గురించి.. నేను తెలుగులో అడుగుతుంటే నువ్వు ఇంగ్లీష్​లో చెప్తున్నవ్​’ అని ముత్తిరెడ్డి అనగానే కొండల్​రెడ్డి కూడా​‘నేను తెలుగులనే చెబుతున్న నీకు’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్​ ఏం మాట్లాడుతున్నవ్​..ఎట్లున్నది నీకు.. సక్కగ మాట్లడవయా’ అంటూ ఫైర్​అయ్యారు. దీనికి ఫారెస్ట్​ఆఫీసర్​ ‘మీరు రెస్పెక్ట్​ ఇస్తే నేనూ ఇస్తా లేదంటే ఏం జేస్కుంటవో చేస్కో’ అని బదులిచ్చారు. మరింత ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ‘పెట్టెయ్​ ఫోన్’ అనగానే ఫారెస్ట్​ ఆఫీసర్​ కూడా ‘పెట్టెయ్ ​ఫోన్’ అని అన్నారు. వెంటనే ఎమ్మెల్యే కలెక్టర్ శివలింగయ్యకు, డీఎఫ్​ఓకు ఫోన్​ చేసి కంప్లయింట్ ​చేశారు.  

తనో యూజ్​లెస్​ : కలెక్టర్​ శివలింగయ్య

కలెక్టర్​ శివలింగయ్యకు ఫోన్​ చేసిన ముత్తిరెడ్డి తాను ఆర్నెళ్లుగా కొండెంగ సమస్య ఉందని, దాదాపుగా 30 నుంచి 40 మందిని కరిచిందని ఎఫ్​ఆర్​ఓకు చెప్తే ఏం జేస్కుంటరో చేస్కోండి అని మాట్లాడుతున్నాడని.. దీనికి గ్రామస్థులే సాక్ష్యమన్నారు. తాను లౌడ్​ స్పీకర్​ పెట్టి మాట్లాడానని, అందరూ విన్నారన్నారు. స్పందించిన కలెక్టర్​ ‘అలా మాట్లాడిండా.. తనో యూజ్​ లెస్’ అంటూ ‘విచారణ చేపట్టి మనం ఏం జెయ్యాల్నో అది చేద్దాం’  అని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్థులు, ఇక్కడి సర్పంచ్​తో రాత పూర్వక కంప్లయింట్ ​ఇప్పిస్తానని గవర్నమెంట్​అంటే ఏంటో తెలిసొచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.