- రైలు కోసం ఎదురుచూస్తుండగా లాక్కెళ్లిన దుండగులు
- కారులో దాడి చేసి డబ్బులు డిమాండ్
జనగామ అర్బన్, వెలుగు: ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేసి అతడి వద్ద బంగారం, మొబైల్ దోచుకున్నారు. సదరు యువకుడిని చితకబాది హైవే పక్కన వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు తెలిపిన ప్రకారం..
జనగామ పట్టణంలోని ప్రిస్టన్ ఏరియాకు చెందిన కొమిరె కార్తికేయ(19) ఏపీలోని విజయవాడలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఉగాది పండుగకు ఇంటికి వచ్చాడు. తిరిగి విజయవాడకు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం జనగామ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తాను ఎక్కాల్సిన శాతవాహన రైలు మిస్ కావడంతో పద్మావతి రైలు కోసం రెండో ప్లాట్‌ఫాంపై ఎదురుచూస్తున్నాడు. అతడి దగ్గరికి నలుగురు యువకులు వచ్చి మత్తు మందు ప్రయోగించారు.
కారులో ఎక్కించుకుని హన్మకొండ–హైదరాబాద్ హైవేపైకి వచ్చారు. హైదరాబాద్ వైపు వెళ్తుండగా కళ్లెం గ్రామ సమీపంలో యువకుడికి స్పృహ వచ్చింది. మెడలో ఉన్న తులం బంగారు గొలుసుతో పాటు స్మార్ట్‌ఫోన్ లాక్కున్నారు. ఆ తరువాత యువకుడిని హైవే పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
