సర్కారీ స్కూల్స్లో ‘యూ’ సీటింగ్ .. అమలు స్టార్ట్ చేసిన విద్యాశాఖ

సర్కారీ స్కూల్స్లో  ‘యూ’ సీటింగ్ .. అమలు స్టార్ట్ చేసిన విద్యాశాఖ
  • ప్రతీ స్టూడెంట్​పై ప్రత్యేక శ్రద్ధ 
  • బ్యాక్​ బెంచ్​ విధానానికి ఇక ముగింపు 

జనగామ, వెలుగు : సర్కారు బడుల్లో యూ సీటింగ్​అమలు మొదలుపెట్టారు. విద్యార్థుల్లో అసమానతలు తొలగించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు జనగామ జిల్లాలోని అన్ని స్కూల్స్ లో వీలైనంత వరకు బ్యాక్​ బెంచ్ విధానానికి ముగింపు పలుకుతున్నారు. యూ ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు వీలు కలుగుతుందని టీచర్లు చెబుతున్నారు.

వేగంగా స్టార్ట్..​

స్టూడెంట్ల అభ్యసనా సామర్థ్యపు పోటీల్లో దేశంలోనే ఉత్తమ 50 జిల్లాల్లో ఒకటిగా నిలిచిన జనగామ మరో సంస్కరణ చేపట్టింది. తరగతి గదుల్లో యూ  ఆకారంలో స్టూడెంట్లను కూర్చోబెట్టాలని సర్కారు ఇటీవల మౌఖిక ఆదేశాలిచ్చింది. వీలైన చోట్ల తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ ఆదేశాల మేరకు డీఈవో భోజన్న ఆయా పాఠశాలల హెచ్​ఎంలను సూచించారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, గదుల వైశాల్యం ఆధారంగా ‘యూ’ ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతో పలు పాఠశాలల్లో ఈ ప్రక్రియ షురూ అయింది. 20 మంది స్టూడెంట్లకు అటుఇటుగా ఉన్న చోట యూ ఆకారం ఏర్పాట్లు బాగున్నా, అంతకు మించి స్టూడెంట్లు ఉన్న చోట గది వైశాల్యం సరిపోని పరిస్థితులున్నాయి. దీంతో సదరు తరగతుల్లో ప్రస్తుత పద్ధతినే కొనసాగించనున్నారు. 

ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకే..

బెంచీ వెనక బెంచీతో బ్యాక్​ బెంచ్​ స్టూడెంట్స్​ అనే ఆత్మనూన్యతా భావానికి వీలైనంత మేరకు చెక్​ పెడుతున్నారు. యూ ఆకారంలో అయితే ప్రతీ స్టూడెంట్ పై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో  ప్రతీ విద్యార్థికి బ్లాక్​ బోర్డు స్పష్టం కనిపిస్తోంది. ఏకాగ్రత ఉపాధ్యాయుల బోధన వైపు ఉంటూ అభ్యసనా సామర్థ్యం మెరుగవుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని టీచర్లు చెబుతున్నారు. పాఠ్యాంశాల బోధన టైంలో వెనుకభాగంలో కూర్చున్న విద్యార్థులను పరిశీలించడం పూర్తిస్థాయిలో వీలు కాదని, కానీ యూ ఆకారంలో సీటింగ్ వల్ల ప్రతీ ఒక్కరిని దగ్గరగా చూడొచ్చని, వింటున్నారా లేదా తెలుసుకోవచ్చంటున్నారు.

 విద్యార్థులు తక్కువగా ఉన్న తరగతుల్లో వ్యక్తిగత పరిశీలనకు అనువుగా ఉంటుంది. విద్యార్థులు వారి పక్కన కూర్చున్న వారితో సులభంగా అభ్యాసాన్ని పంచుకోవడం వీలవుతుందని,  పరధ్యానంగా ఉన్న వారిని గమనించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  అదేవిధంగా యూ సీటింగ్​వల్ల స్టూడెంట్లతో టీచర్ల ముఖాముఖి సులువు కానుంది. ప్రతీ విద్యార్థి కదలికను పసిగట్టి వారిలో ఏకాగ్రత పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చు. విద్యార్థులందరితో మాట్లాడగలగడంతో పాటు వారి మాట వినడం, చర్చించడానికి సహాయపడుతుందంటున్నారు. గ్రూప్​ చర్చలకు కూడా ఈజీ అవుతుందని, తద్వారా సబ్జెక్ట్​ పై మరింత అవగాహన పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పద్ధతి తో విద్యార్థుల్లో మెడ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సీటింగ్ లో మార్పు చేసేలా చర్యలు 
తీసుకుంటున్నారు.

యూ సీటింగ్​తో మేలు..

సర్కారు బడుల్లో చదివే ప్రతీ విద్యార్థికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో స్కూల్స్​లో యూ సీటింగ్​అమలు చేస్తున్నం. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నాం. అనుకూలత ఆధారంగా వీలైనన్ని స్కూల్స్​లో  ఏర్పాట్లు చేస్తున్నం. దీని ద్వారా ప్రతీ స్టూడెంట్ పై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టే చాన్స్​ఉంటుంది. స్టూడెంట్స్ లో బ్యాక్​ బెంచ్​అనే భావన తొలిగిపోనుంది.

రిజ్వాన్​ బాషా షేక్, కలెక్టర్, జనగామ