హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే రాబోయే మున్సిసల్ ఎన్నికల్లో పార్టీ పోటీలో ఉంటుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాల్లూరి రామ్, తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ శనివారం మీడియా ప్రకటనలో తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
పార్టీ ప్రెసిడెంట్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆయన ఆశయాలను, తెలంగాణపై ఆయనకు ఉన్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడంలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు రామ్ తెలిపారు. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. కాగా గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు జనసేన నుంచి గెలిచారు. ఇటీవల కొండగట్టు పర్యటనకు వచ్చిన సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
