జీ 20 సదస్సు డైవర్ట్ చేయడానికే చంద్రబాబు అరెస్ట్ : పవన్ కల్యాణ్

జీ 20 సదస్సు డైవర్ట్ చేయడానికే చంద్రబాబు అరెస్ట్ : పవన్ కల్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ మద్దతు కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖపట్నంలో గొడవ జరిగినప్పుడు చంద్రబాబు వచ్చి తమకు మద్దతు తెలిపారని, ప్రజల కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు... తిరిగి ఆ వ్యక్తి కోసం నిలబడటం సంస్కారం అని.. అందుకే చంద్రబాబుకు మద్దతు ఉంటుందని చెప్పానన్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయాలను మరోస్థాయికి తీసుకెళ్లిందని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు.

ALSOREAD: జైలుకు చంద్రబాబు.. టపాసులు కాల్చి స్వీట్లు పంచిన రోజా

శనివారం (సెప్టెంబర్ 9న) రాత్రి తనను పోలీసులు అడ్డుకున్నారని... ఆ సమయంలోతానేం చేయాలని ప్రశ్నించారు. అందుకే నడి రోడ్డుపై కూర్చున్నానని చెప్పారు. లా ఆర్డర్ సమస్యను క్రియేట్ చేసింది వైసీపీ వాళ్లే అని అన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ చేసే పనులన్నీ ప్రతిపక్షాలకు బలం ఇస్తున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని చేసినా.. ఎవరు భయపడరని, మరింత ధృఢ పడుతామన్నారు. నిజంగా చట్టాలు సంపూర్ణంగా పని చేస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాలేడన్నారు.

తమ సమస్యలను చెప్పుకునేందుకు వైజాగ్ లో ఉన్న తన వద్దకు దివ్యాంగులు వస్తే వారి పెన్షన్స్ ను కట్ చేశారని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా నలిగిపోతున్నారని చెప్పారు. భారత్ నాయకత్వం వహిస్తున్న జీ 20 సదస్సు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయించడం ఏంటని ప్రశ్నించారు. జీ 20 సదస్సును డైవర్ట్ చేయడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. కేంద్రంపై గౌరవం లేకుండా జీ20 సదస్సుపై ప్రజల్లో ఉండే ఆసక్తిని చంపేశారని ఆరోపించారు. కేంద్రం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ విషయంపై తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

ప్రజాదరణ ఉన్న నాయకుల పట్ల ఇట్లా చేస్తే సామాన్య వ్యక్తి ఈ రాష్ట్రంలో బతకగలడా... అని ప్రశ్నించారు. మద్యపానం నిషేధిస్తామని చెప్పి.. మద్యం అమ్మకాలపై డబ్బులు సంపాదిస్తుంటే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం ఇదేనన్నారు. 

గతంలో వైఎస్ జగన్ ను వరంగల్ లో రాళ్లతో తరమికొట్టారని... ఆంధ్రప్రదేశ్ యువత కూడా త్వరలో అదే చేయబోతుందన్నారు. జగన్ ఫ్యాక్షనిజం పులివెందులలో చెల్లుతుంది గానీ.. ఆంధ్రప్రదేశ్ లోచెల్లదన్నారు. ప్రాణం పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని, తాము పారిపోమన్నారు.