నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరి సొంతం అయ్యాయి : పవన్ కల్యాణ్

నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరి సొంతం అయ్యాయి : పవన్ కల్యాణ్

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఇవన్నీ అందరికీ అందాయా.. ఎవరి సొంతం అయ్యాయి అంటూ ప్రశ్నించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో.. ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. 2023, నవంబర్ 7వ తేదీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 

దేశానికి మోదీ అనుభవం ఎంతో అవసరం అని.. సీఎంగా, పీఎంగా ఆయన నిర్ణయాలు దేశానికి మార్గనిర్దేశం అయ్యాయన్నారు పవన్ కల్యాణ్. ఆర్టికల్ 370, ట్రిబుల్ తలాఖ్, మహిళా బిల్లు, రామ మందిరం, నోట్ల రద్దు వంటి ఎన్నో సంచలన నిర్ణయాలను దేశం కోసం తీసుకున్న వ్యక్తి మోదీ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.  దేశ ప్రయోజనాలే లక్ష్యంగా.. ప్రధాని మోదీ పని చేస్తున్నారని.. అందుకే ఆయన అంటే ఎంతో ఇష్టం అన్నారు పవన్ కల్యాన్. 

మోదీ ప్రధాని అయిన తర్వాత లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి దాడులు లేవని.. శత్రుదేశాల్లోకి వెళ్లి దాడులు చేసిన ఘనత ఆయనదే అన్నారు పవన్. బలమైన నాయకుడు దేశానికి కావాలని.. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలని.. అలాంటి నేత ప్రధాని మోదీ అన్నారాయన. రాబోయే ఎన్నికల్లోనూ ఆయనే పీఎం కావాలని కోరుకుంటున్నానని.. తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు అందుకే ఇస్తున్నట్లు వెల్లడించారు పవన్ కల్యాన్.