తెలంగాణలో పోటీకి జనసేన రెడీ

తెలంగాణలో పోటీకి జనసేన రెడీ

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్దమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆ పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు.  గతంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క స్థానంలో కూడా బరిలోకి దిగని పవన్‌కల్యాణ్‌… ఈసారి జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు దాదాపు అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగేందుకు వ్యూహాలు  రచిస్తున్నారు. జనసేన పార్టీని ఒకే రాష్ట్రానికి పరిమితం చేయకుండా తెలంగాణలో కూడా తన బలాన్ని పెంచుకునే దిశలో పవన్‌ కల్యాణ్‌ అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ సాధారణ ఎన్నికల్లో పోటీకి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఇంకో నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీ యంత్రాంగాన్ని సమాయాత్తం చేసే దిశగా చర్యలు చేపట్టారు. పార్టీ పరంగా ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు పవన్. ఈ క్రమంలో తెలంగాణలోని నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా ఇటీవల లోక్‌ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి తెలంగాణలో పార్టీని విస్తరింప చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్‌, వర్కింగ్‌ కమిటీలను నియమించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు నాయకుల పరిశీలన చురుకుగ్గా సాగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో తాత్కాలిక కమిటీల నియామకాలను కూడా పూర్తి చేయనున్నారు. ఇందుకు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ  TRSకు పరోక్షంగా మద్దతు ప్రకటించిన పవన్‌కల్యాణ్‌ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. యువతలో జనసేన పార్టీ పట్ల క్రేజ్‌ ఉండటంతో ప్రతీ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ గణనీయంగా ఓట్లను తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలతో ఏర్పడిన మహాకూటమిలో CPI భాగస్వామ్యమై పోటీ చేయడంతో ఆ పార్టీని పక్కనపెట్టాలని దాదాపు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా CPM తో కలిసి పనిచేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.