జనగామ అర్బన్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ర్యాలీలకు, వాహనాలకు, మైక్, ప్రచార సామగ్రి ముద్రణ చేయడం వంటివి ఖచ్చితంగా పాటించాలని అధికారులకు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నోడల్, జోనల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల నోడల్, జోనల్ అధికారులతో ఎన్నికల పరిశీలకులు నర్సింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు ఎంతో కీలకమని, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించి, సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్‌కు, మెటిరీయల్ పంపిణీ కి చేపట్టవలసిన చర్యలపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పని సరిగా అందాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ బృందాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎంసీసీ నోడల్ అధికారి దశల వారీగా నివేదికలను సమర్పించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్రమం తప్పకుండా అధికారులు, సిబ్బంది సమీక్షలు నిర్వహించాలని, పోలింగ్ నిర్వహించే సిబ్బందికి ర్యాండమైజేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తహాలోనే మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్ధవంతంగా, ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు కృషి చేయాలని, అభ్యర్థులు, రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ఖర్చులను ఎన్నికల నియమావళి ప్రకారం నమోదు చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు ఎస్.జయశ్రీ, జడ్పీ సీఈవో మాధురి షా, జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ, పీడీ హౌసింగ్ కొదండరాం, డీసీవో మాతృనాయక్, ఎలక్షన్ పర్యవేక్షకులు, నోడల్, జోనల్, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై కలెక్టర్ అబ్జర్వర్ నర్సింహారెడ్డికి వివరించారు.
