జనగామ అర్బన్, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ 100 రోజుల పని కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఉపాధి హామీ పనుల పురోగతి పైన అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్ తో కలిసి పీడీ హోసింగ్, పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలతో రివ్యూ నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
రైతుల బీడు పొలాల అభివృద్ధి పనులు, పొలాలకు వెళ్లే బాటలు, చెరువులు, కుంటల్లో పూడికతీత, కందకాలు తవ్వడం వంటి పనులను ఉపాధి హామీ పథకంలో చేర్చి ప్రతి గ్రామానికి 75 మందికి తగ్గకుండా కూలీలతో పని చేయించాలన్నారు. ‘మన జిల్లా మన నీరు 2.0’ లో భాగంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టి, వాటిని జెఎస్జేబీ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు. వచ్చే వేసవికి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ వసంత, అడిషనల్ డీఆర్డీఏలు నూరుద్దీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
