
న్యూయార్క్: గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తన ట్రేడ్ మార్క్ ఆటతో చెలరేగుతున్న ఇటలీ స్టార్ ప్లేయర్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్... యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఆల్ ఇటాలియన్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సినర్ 6–1, 6–4, 6–2తో పదో సీడ్ లోరెంజో ముసెటీపై గెలిచాడు. సినర్‌కు ఇది వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ సెమీస్ కావడం విశేషం. అలాగే హార్డ్ కోర్ట్స్‌పై జరిగిన మేజర్ టోర్నీల్లో వరుసగా 26 విజయాలు సాధించాడు. ఇందులో గత రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్, 2024 యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.
ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను సినర్ రెండు గంటల్లోనే ముగించాడు. బలమైన సర్వీస్‌లు, బేస్ లైన్ గేమ్‌తో తొలి సెట్‌ను కేవలం 27 నిమిషాల్లోనే సొంతం చేసుకున్నాడు. ముసెటీ కొట్టిన ఏడు బ్రేక్ పాయింట్లలో సినరే గెలిచాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 38 గేమ్‌లను మాత్రమే చేజార్చుకున్న సినర్.. 2020 తర్వాత అతి తక్కువ టైమ్‌లో యూఎస్ ఓపెన్ సెమీస్ చేరిన రెండో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. వరుసగా 31 సర్వీస్‌లను నెగ్గిన సినర్ 46 ఫస్ట్ సర్వ్‌లో 42 పాయింట్లు సాధించాడు. సినర్ 10 ఏస్‌లు, 28 విన్నర్స్ కొట్టాడు. 17 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో ఒక్క ఏస్, రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన ముసెటీ 12 విన్నర్లు, 22 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో 25వ సీడ్ ఫెలిప్ అగుర్ అలియాసిమ్ (కెనడా) 4–6, 7–6 (9/7), 7–5, 7–6 (7/4)తో 8వ సీడ్ అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై గెలిచి.. సినర్‌తో సెమీస్‌కు పోరుకు సిద్ధమయ్యాడు.
స్వైటెక్‌కు షాక్
విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్ ఇగా స్వైటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. 8వ సీడ్ అమండా అనిసిమోవా (అమెరికా) 6–4, 6–3తో స్వైటెక్ (పోలెండ్)ను ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. అనిసిమోవాకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్, తొలి యూఎస్ ఓపెన్ సెమీస్ కావడం విశేషం. గంటా 36 నిమిషాల మ్యాచ్‌లో ఓ దశలో అనిసిమోవా వెనకబడినా సకాలంలో తేరుకుంది. మ్యాచ్ మొత్తంలో 3 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్స్ చేసిన అమెరికన్.. 9 బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని కాపాడుకుంది. 12 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్, 23 విన్నర్లతో 67 పాయింట్లు నెగ్గింది. ఇక 2 ఏస్‌లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేసిన స్వైటెక్ 4 బ్రేక్ పాయింట్లతో రెండింటిని సద్వినియోగం చేసుకుంది. 13 విన్నర్లు, 15 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. మరో మ్యాచ్‌లో 23వ సీడ్ నవోమి ఒసాక (జపాన్) 6–4, 7–6 (7/3)తో 11వ సీడ్ కరోలినా ముచోవా (చెక్)పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించింది.
యూకీ తొలిసారి..
ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ భాంభ్రీ.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరాడు. మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో జతకట్టిన యూకీ.. యూఎస్ ఓపెన్ మెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో 6–3, 6–7 (6/8), 6–3తో రాజీవ్ రామ్ (అమెరికా)–నికోలా మెక్టిక్ (క్రొయేషియా)పై గెలిచారు. 2 గంటలా 37 నిమిషాల మ్యాచ్‌లో ఇండో–కివీస్ జోడి స్థాయికి తగిన పెర్ఫామెన్స్ చూపెట్టింది. బలమైన సర్వీస్‌లతో పాటు 5 ఏస్‌లు కొట్టింది. ఏడు బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. 12 డబుల్ ఫాల్ట్స్ చేసినా 60 విన్నర్లతో మ్యాచ్‌ను ముగించింది. 4 ఏస్‌లు, 6 డబుల్ ఫాల్ట్స్ చేసిన రాజీవ్–-మెక్టిక్ ద్వయం 12 బ్రేక్ పాయింట్లలో ఒక్క దాన్ని మాత్రమే కాపాడుకుంది. 19 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకుంది.