జపాన్‌లో ఆగస్టు 31 వరకు అత్యవసర పరిస్థితి 

జపాన్‌లో ఆగస్టు 31 వరకు అత్యవసర పరిస్థితి 

టోక్యో : ఒలింపిక్స్ విజయవంతంగా నిర్వహిస్తున్నామన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. జపాన్ లో కరోనా కేసుల విజృంభణ మళ్లీ మొదలయ్యాయి. సునామీలా వ్యాప్తి చెందే పరిస్థితి కనిపిస్తుండడంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు ఆగస్టు 31వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది. మరికొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాన మంత్రి యొషిహిడే సుగ కార్యాలయం శనివారం అధికారికంగా ట్వీట్టర్ లో ఈ వివరాలను ప్రకటించింది. 
ఒలింపిక్స్ నిర్వహిస్తున్న టోక్యో నగరంతోపాటు, సైటమ, చీబా, కనగవ, ఒసాకా, ఒకినావా ప్రిఫెక్సర్లలో ఆగస్టు 31 వరకు అత్యవసర పరిస్థితిని విధించింది. అలాగే హొక్కాయిడో, ఇషికావా, క్యోటో, హ్యోగో ప్రిఫెక్చర్లలో ప్రత్యేక చర్యలు అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తున్నట్లు జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. 
జపాన్ లో జులై 29న 10 వేల 699 కేసులు నమోదు కాగా అదే రోజు 3 వేల 865 కేసులు నమోదైనట్లు టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం తెలిపింది. టోక్యో, ఒకినావా నగరాలలో ఆగస్టు 22తో అత్యవసర పరిస్థితి ముగుస్తుందని జపాన్ పీఎంఓ వివరించింది. కేసుల పెరుగుదల నేపధ్యంలో యువతకు వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపింది. అలాగే వచ్చే ఆగస్టు నెలాఖరు నాటికి  జనాభాలో 40 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా 50 ఏ వయసు పైబడినవారిలో తీవ్రమైన వ్యాధులు గలవారికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వడంతోపాటు.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.