- ప్రపంచంలోనే 4వ అత్యంత కాలుష్యకారక స్థలంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డు
- గంటకు రిలీజ్ అవుతున్న మిథేన్ 5.9టన్నులు
- కార్బన్డయాక్సైడ్ కంటే 86రెట్లు డేంజర్
- గ్రౌండ్ వాటర్ కలుషితం10కి.మీ
- 12లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యానికి సమానం
- రోజూ యార్డ్‌కు వస్తున్న చెత్త 8-, 10 వేల టన్నులు
- నీటిలో టీడీఎస్ 4వేలు
- యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ డంపింగ్‌యార్డు ఇప్పుడు మిథేన్వంటి విషవాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ప్లేస్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఇక్కడ కోటి 40 లక్షల టన్నుల చెత్తని రాంకీ సంస్థ క్యాపింగ్ (భూమిలో పూడ్చిపెట్టడం) చేసింది. దీనివల్ల ఇక్కడ ఎటువంటి సమస్య లేదని, చుట్టుపక్కల వారికి కూడా ఏమీ కాదని, ల్యాండ్ ఫిల్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తని ప్రాసెస్ చేస్తున్నామని రాంకీ చెప్తోంది. అయితే, అవన్నీ అబద్దాలేనని ఇప్పటికే పలు స్టడీ రిపోర్టులు తేల్చగా తాజాగా యూసీఎల్ఏ రిపోర్టులో భయంకర నిజాలు బయటకు వచ్చాయి.
గోల్కొండ కోట కంటే ఎత్తు
మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్‌నగర్‌లో దాదాపు 393.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్‌యార్డు ఉంది. ఇక్కడ 1994 నుంచి చెత్త వేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో సిటీ నుంచి రోజు 2,500 నుంచి 3వేల టన్నుల చెత్త వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్టు నిర్వహణ చేశారు. ప్రస్తుతం 8 వేల టన్నుల 10 వేల టన్నుల చెత్త ఇక్కడికి వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కోటి 40 లక్షల టన్నుల పాత చెత్త పేరుకుపోయింది. దీన్నంతా ల్యాండ్ ఫిల్ (క్యాపింగ్) చేసి దానిపై మళ్లీ చెత్త డంప్ చేస్తున్నారు. దుండిగల్‌లో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి చెత్త తరలిస్తున్నామని, 2వేల టన్నులను విండ్రో కంపోస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది కాకుండా రోజూ వేస్టు టు ఎనర్జీ ప్లాంట్ లో 2వేల టన్నులను ఉంచుతున్నారు. అంతా పోను రెండు నుంచి మూడువేల టన్నుల చెత్త మిగులుతుండడంతో అంతా క్యాపింగ్ చేసిన చెత్త కుప్పపై వేస్తున్నట్టు సమాచారం. దీంతో సమస్య మరింత తీవ్రమవుతున్నది. ఇక్కడి చెత్త ఎంతలా పేరుకుపోయిందంటే సముద్ర మట్టానికి 614 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇది 608 మీటర్లున్న గోల్కొండ కోట కంటే ఎత్తయినది కావడం గమనార్హం. దీన్ని సరిగ్గా ట్రీట్చేయకపోవడం, ప్రత్యామ్నాయం చూడకపోవడం పర్యావరణానికి ముప్పుగా పరిణమించింది.
భయంకరమైన నిజాలు బయటకు
యూసీఎల్ఏ ప్రొఫెసర్లు, రీసెర్చ్స్కాలర్స్జవహర్నగర్ డంపింగ్యార్డ్పరిస్థితి చూసి కంగారుపడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం కంపు కొట్టడమే కాదని, భూగోళాన్నే వేడెక్కిస్తుందని తేల్చారు. ఈ డంపింగ్‌యార్డు నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మిథేన్వాయువు విడుదలవుతోందని, పరిశోధనలో తెలుసుకుని షాక్అయ్యారు. ఈ మిథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని, ఇక్కడ గంటకు వెలువడే గ్యాస్.. రోడ్ల మీద తిరిగే 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానమని పేర్కొన్నారు. చివరకు పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డుల్లో జవహర్‌నగర్ ది నాలుగో స్థానమని తేలింది.
టాప్ 25లో రెండు మనవే..
ప్రపంచవ్యాప్తంగా 700 పైగా డంపింగ్ యార్డులను పరిశీలిస్తే.. టాప్ 25లో ఇండియా నుంచి రెండు యార్డులున్నాయి. అందులో ఒకటి జవహర్‌నగర్ (నాలుగో స్థానం) కాగా, మరోటి ముంబైలోని కంజుర్ మార్గ్ డంపింగ్‌యార్డు..ఇక్కడ గంటకు 4.9 టన్నుల మిథేన్వస్తోందని తేలింది. ఇక అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ యార్డు గంటకు 7.9 టన్నుల మిథేన్విడుదలతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
మీథేన్ఎంత డేంజర్ అంటే..
కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ సుమారు 86 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్‌లో 45శాతం కంటే ఎక్కువ వాటా ఈ మిథేన్దే అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం డంపింగ్ యార్డు చుట్టూ గాలి పీల్చుకుంటే కొన్నేండ్లలోనే ఊపిరితిత్తులు పాడైపోవడం ఖాయం. మిథేన్ సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. తల తిరగడం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
గ్రౌండ్‌వాటర్, చెరువులు కలుషితం
జవహర్నగర్డంపింగ్యార్డు వల్ల చుట్టుపక్కల గ్రౌండ్‌వాటర్ పొల్యూట్అయ్యింది. 10 కిలోమీటర్ల మేర భూమి లోపల నీళ్లు కలుషితమయ్యాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక్కడి నీటి టీడీఎస్ చెక్ చేస్తే 4 వేలకు పైగా ఉంది. ఈ నీటితో స్నానం చేస్తున్న వారికి చర్మ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ నీటిని వాడిని కొందరి కిడ్నీలు కూడా ఫెయిలయ్యాయి. ఇక్కడి చెత్త నుంచి విద్యుత్‌ఉత్పత్తి చేయడానికి 2023 ఏప్రిల్ 15న రూ.251 కోట్లతో 2వేల కేఎల్డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్‌ఉత్పత్తి ప్రక్రియ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని పలు స్టడీ రిపోర్టులు వెల్లడించాయి. ప్లాంట్ నుంచి వచ్చే లీచెట్ తో చుట్టుపక్కల చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. దుర్గంధం వెదజల్లుతోంది. దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని కాలనీల్లో డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటితో వాటర్ పొల్యూషన్ అవుతుంది.
అసలేంటీ యూసీఎల్ఏ?
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెల్స్(యూసీఎల్ఏ) అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఈ యూనివర్సిటీ చదువే కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను కనుక్కుంటుంది. పర్యావరణం, హెల్త్, టెక్నాలజీ, స్పేస్వంటి రంగాల్లో లోతైన పరిశోధనలు చేస్తుంది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే మిథేన్ వంటి వాయువుల ప్రభావంపై స్టడీ చేస్తూ ప్రభుత్వాలకు పలు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా వీరు 2025లో ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ చేపట్టారు. ఇందు కోసం వీరు శాటిలైట్ల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించారు.
ముందుకు సాగని కొత్త యార్డుల పనులు
జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకుశివారు ప్రాంతాల్లో కొత్తగా డంపింగ్ యార్డ్లు నిర్మాణాలకి సంబంధించి పనులు ముందుకు సాగడంలేదు. ఒక్క దుండిగల్ ప్లాంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ 12.5 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కొనసాగుతుంది. ఇక్కడకు డైలీ 800 టన్నుల చెత్త వెళుతుంది. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలంలో 15 మెగా వాట్ల కెపాసిటీతో వేస్ట్ టు -ఎనర్జీ ప్లాంట్‌ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. అయితే స్థానిక ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై కోర్టుకి వెళ్లడంతో పనులకు బ్రేక్ పడింది. ఇలా నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో కేవలం 2వేల టన్నుల చెత్త మాత్రమే జవహర్ నగర్ తో పాటు దుందిగల్ ఎనర్జీ ప్లాంట్ కి వెళుతుంది. డైలీ 5500 టన్నుల చెత్త జవహర్ నగర్ లో మిగులుతోంది.
పేదలకే ఇబ్బందులు...
డంప్ యార్డ్ చుట్టూ 80% ప్రజలు పేదలుంటున్నారు. వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య గురించి మేం ఎన్నో ఏండ్లుగా మొత్తకుంటున్నాం. చెక్ పెట్టడానికి ఏండ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయే తప్ప పరిష్కారం చూపడంలేదు.
- సందీప్, నవోదయ వెల్ఫేర్ సొసైటీ (ప్రెసిడెంట్)
నష్టమేంటో చెప్తాం
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మీథేన్ విడుదల చేస్తున్న డంపింగ్ యార్డులు బ్రెజిల్, చిలీ దేశాల్లో మూడు చొప్పున.. భారత్, సౌదీ అరేబియా, టర్కీల్లో రెండు చొప్పున ఉన్నాయి. కాలుష్యాన్ని గుర్తించడమే కాకుండా, తక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమైన కచ్చితమైన డేటాను ప్రభుత్వాలకు అందించడం మా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. డేటా స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రభుత్వాలు, ఆయా కేంద్రాల నిర్వాహకులు సాకులు చెప్పడానికి అవకాశం ఉండదు. మేం శాటిలైట్ద్వారా గుర్తించిన డంపింగ్‌యార్డుల నుంచి వెలువడే మిథేన్వాయువులు ప్రమాదకర స్థాయిల్లో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడం స్థానిక ప్రభుత్వాల బాధ్యత.
- జువాన్ పాబ్లో ఎస్కుడె,
యూసీఎల్ఏ పరిశోధకుడు

