వీర జవాన్​ మురళీనాయక్​ అంత్యక్రియలు పూర్తి

వీర జవాన్​ మురళీనాయక్​ అంత్యక్రియలు పూర్తి

దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడైన  శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి.   మురళీనాయక్ భౌతికకాయానికి ఆయన స్వగ్రామంలో  ప్రభుత్వం  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. 

అంతకుముందు జవాన్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. అమరజవాన్ తల్లిదండ్రులను మంత్రి లోకేష్​  ఓదార్చారు.మురళీ నాయక్‌ ధైర్య సాహసాలను స్మరిస్తూ మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

మురళీనాయక్​ అగ్నివీర్​ గా 2022లో సైన్యంలో చేరారు.  రెండున్నర సంవత్సరాలు సర్వీస్​ పూర్తి చేసుకున్న మురళీనాయక్​... నాశిక్​ లో విధులు నిర్వహిస్తున్నారు.  ఆర్మీ అధికారుల పిలుపుతో ఆపరేషన్​ సింధూర్​ తరువాత జమ్మూకాశ్మీర్​ లో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. పహల్గాం దాడి తరువాత భారత్​.. పాకిస్తాన్​ మధ్య జరుగుతున్న కాల్పుల్లో రాజౌరి సెక్టార్​ లో జరిగిన ఫైరింగ్​ లో మురళీనాయక్​ వీరమరణం పొందారు. 

ఏపీ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని  ఆయన గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మురళీ నాయక్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం తరపున కాకుండా మురళీనాయక్ కుటుంబానికి తాను కూడా వ్యక్తిగత ఆర్థిక సాయం ప్రకటించారు పవన్​ కళ్యాణ్​. మురళీనాయక్ కుటుంబానికి తన తరపున రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీరజవాన్‌ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.