ఉగ్రవాదులను ఏరివేయడానికి EC అనుమతి కావాలా: మోడీ

ఉగ్రవాదులను ఏరివేయడానికి EC అనుమతి కావాలా: మోడీ

ఖుషినగర్(యూపీ): టెర్రరిస్టులపై దాడులు చేసేందుకు ఆర్మీ..ఎలక్షన్  కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని కాశ్మీర్ లోని ఎన్​కౌంటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్​లో ఈ మధ్య జరిగిన ఇద్దరు మిలిటెంట్ల ఎన్​కౌంటర్​ను ప్రస్తావిస్తూ.. టెర్రరిస్టులు బాంబులు, తుపాకులతో జవాన్ల ముందు నిల్చుని ఉంటే.. వారిని షూట్ చేయడానికి జవాన్లు ఈసీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఆదివారం యూపీలోని ఖుషినగర్ లో ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడారు. తాను కాశ్మీర్ కు వచ్చినప్పటి నుంచి రెండు..మూడ్రోజులకు ఒకసారి ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఎన్​కౌంటర్లు కూడా తాను చేపట్టిన స్వచ్చ భారత్​లో భాగమేనని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

బలమైన దేశం కోసం, బలమైన ప్రభుత్వం కోసం ప్రజలు ఓటు వేస్తున్నారని, దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందన్నారు. అందుకే మహామిలావత్​ ఫ్రస్ట్రేషన్​తో ముక్కలవుతోందన్నారు. దేశభద్రత అనే అంశాన్నే తమ పార్టీ నినాదంగా ప్రచారం చేశామని.. అందుకు కట్టుబడి ఉంటామన్నారు.  తాము ప్రేమిస్తాం… మోడీ ద్వేషిస్తాడని ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదివారం చేసిన విమర్శలను మోడీ తిప్పికొట్టారు. ‘‘కాంగ్రెస్ నేతలు ప్రతిరోజు నాపై అన్ని రకాల తిట్లను ప్రయోగిస్తున్నారు. వాళ్లది ప్రేమ ముసుగులో ద్వేషం”అని కౌంటర్ ఇచ్చారు.

మొసలి కన్నీరొద్దు  మద్దతు వాపస్ తీస్కోండి

అల్వార్ రేప్  ఘటనతో రాహుల్ గాంధీ​ నోరు మూతపడిందని,  జరిగిపోయిందేదో జరిగిందన్న విధంగా  కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మోడీ ఆరోపించారు. దీనిపై బీఎస్పీ చీఫ్ మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ‘నిజంగా మీకు సీరియస్​నెస్ ఉంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ కు మద్దతు ఎందుకు ఉపసంహరించుకోలేదు?ఇంతజరిగినా మాయావతి..  గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతెందుకిస్తున్నారు?  ముందు మద్దతు వెనక్కి తీసుకుని రేప్​ఘటనలో బాధితుల పక్షాన పోరాడాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసమే బీఎస్పీ విఫల ప్రయత్నాలు చేస్తోందన్నారు.

‘‘ఓ దళిత మహిళ అత్యాచారానికి గురైతే.. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. రాజస్థాన్ లో మీ అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఇంకా ఎందుకు ఆ పార్టీకి సపోర్టు చేస్తున్నారని యూపీ ఆడబిడ్డలు మాయావతిని ప్రశ్నిస్తున్నారు”అని మోడీ ట్విట్టర్​లో పోస్టు చేశారు.  కొద్ది రోజుల కిందట రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన సామూహిక అత్యాచారం నిందితులను ఉరి తీయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి శనివారం డిమాండ్ చేశారు. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని రాజస్థాన్ ప్రభుత్వంతో పాటు కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

మోడీపై మాయ ఫైర్
రాజస్థాన్ లో కాంగ్రెస్ కు మద్దతుపై ప్రశ్నిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి కొట్టిపారేశారు. దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన అత్యాచారాలపై మోడీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై జరిగిన అఘాయిత్యాలకు నైతిక బాధ్యత వహించి మోడీ రాజీనామా ఎందుకు చేయలేదు?’ అని ప్రశ్నించారు. అల్వార్ ఘటనపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే రాజస్థాన్​లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడానికి కూడా బీఎస్పీ వెనుకాడదని స్పష్టం చేశారు.