లస్ట్ తో ఆడవు.. లవ్ ఉండాలి: జేడీ చక్రవర్తి

లస్ట్ తో ఆడవు.. లవ్ ఉండాలి: జేడీ చక్రవర్తి

ఈ మధ్య కాలంలో తెలుగులో కంటే ఇతర దక్షిణాది భాషల్లో నే బిజీగా ఉంటున్న జేడీ చక్రవర్తి… కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులోకి వచ్చారు. ఆయన కీలక పాత్ర పోషించిన ‘హిప్పీ’ ఈ నెల 6న విడుదలవుతున్న నేపథ్యం లో జేడీ చెప్పిన సంగతులివి.

తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించడం వల్ల తెలుగులో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తోంది. తెలుగులో ఇటీవలి కాలంలో నన్ను ఎక్సైట్ చేసిన స్క్రిప్ట్ ‘హిప్పీ’నే. నటనలో బిజీ అవడం వల్లే దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టలేదు.

చాలామంది దర్శకులు క్యారెక్టర్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. నేను కథ వినడానికి ట్రై చేస్తాను. కథ బాగుంటే క్యారెక్టర్స్ బాగుంటాయి. హిప్పీ విషయంలో కథకి కనెక్టయ్యాను. ప్రస్తుతం యువత ఎలా ఆలోచిస్తున్నారో అదే ఈ కాన్సెప్ట్.

నాది లవ్‌‌ని కాకుండా లస్ట్‌‌ని నమ్మే పాత్ర. నా సాఫ్ట్​వేర్ కంపెనీలో కార్తికేయ పని చేస్తుంటాడు. నాకు పూర్తి కాంట్రాస్ట్
క్యారెక్టర్ తనది. జీవితం గురించి నేను అతనికి హితబోధ చేస్తుంటాను.

ఇది బోల్డ్ సినిమా. స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఫ్యామిలీస్ తప్పక చూడాలి. లిప్ లాక్స్ వల్ల ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ రాలేదు.  కంటెంట్ బోల్డ్ గా ఉండటం వల్ల వచ్చింది.

క్లారిటీ ఉన్న దర్శకుడు కృష్ణ. ఫ్రెష్ అప్రోచ్‌‌తో పొయిటిక్‌‌గా తీశాడు. కంటెంట్‌‌ని ట్రైలర్‌‌‌‌లో కొంచెమే చూపించాడు.  ప్రేక్షకులు థియేటర్‌‌‌‌కొచ్చి  సర్‌‌‌‌ప్రైజ్ అవ్వాలి అన్నాడు.

లస్ట్ బేస్డ్ సినిమాలెన్ని వచ్చినా అందులో లవ్ అనే ఎమోషన్ స్ట్రాంగ్‌‌గా ఉంటేనే మెప్పిస్తాయి. లవ్ సినిమాల్లో లస్ట్ అనే ఎలిమెంట్ యాడ్ అవ్వొచ్చు కానీ కేవలం లస్ట్ మాత్రమే ఉన్న చిత్రాలు ఆడవు. అలా కొన్ని చిత్రాలు ఆడాయని మిగతావారంతా తీస్తున్నారు. కానీ ఆడిన చిత్రాల్లో ఎమోషనే ఎక్కువగా ఉంది.

‘ఆర్ఎక్స్ 100’ చాలా ఎక్సైట్ చేసింది. నాకది ఎంతగా నచ్చిందంటే  వెంటనే రైట్స్ కొనేశాను. ఆ తర్వాత ఆలోచిస్తే కార్తికేయ, అజయ్ భూపతి తప్ప ఆ చిత్రానికి మరొకరు న్యాయం చేయలేరని రియలైజ్ అయ్యి వదిలేశాను. పోస్టర్‌‌‌‌తోనే ఎక్సైట్ చేసిన సినిమా ‘అర్జున్‌‌రెడ్డి’. చాలా చిత్రాలకు ఆ సినిమా ధైర్యాన్నిచ్చింది.

బాలీవుడ్‌‌లోను, హాలీవుడ్‌‌లోను క్యారెక్టర్ బేస్డ్‌‌ సినిమాలు చేస్తారు. అక్కడ స్టార్స్, యాక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ అని కాకుండా పాత్రకి ప్రాధాన్యతనిస్తారు. కానీ మన దగ్గర హీరో ఓరియంటెడ్ సినిమాలుంటాయి. అది తప్పు కాదు. కానీ దానివల్ల ఇతర పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేం. ఇప్పుడిప్పుడే ఇక్కడా మార్పులొస్తున్నాయి.

ఆడినంత మాత్రాన గొప్ప సినిమా కాదు. ఆడనంత మాత్రాన పిచ్చి సినిమా కాదు. పిచ్చి సినిమా కూడా నాకు నచ్చే కదా నటించాను. సత్య, దెయ్యం, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రాలు నేను గర్వపడేవి. ‘గులాబి’కి ఎంత ఎంజాయ్ చేశానో ఆడని ‘ వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్‌‌’కి అంతే ఎంజాయ్ చేశాను.

వర్మ గారి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాను. ప్రధానంగా హిందీలో రూపొందిస్తాం. తెలుగు, తమిళంలోనూ
రిలీజవుతుంది. స్క్రిప్ట్ నాదే. అక్టోబర్‌‌‌‌లో ప్రకటిస్తాం. హాలాహలం వచ్చాకే అమృతం వస్తుంది. వర్మ గారి విషయంలో ‘సత్య’ కంటే ముందు కొన్ని ప్లాపులు వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే. మళ్లీ ‘సత్య’ లాంటి చిత్రం వస్తుంది.

గతంతో పోల్చితే సెన్సార్ మెరుగైంది. అయినా సెన్సార్ సమస్యల విషయంలో సభ్యులను తప్పుపట్టలేం. వారికిచ్చిన గైడ్ లైన్స్ అనే పుస్తకం వల్లే సమస్యలన్నీ. ఆ పుస్తకాన్ని అప్ డేట్ చేయాల్సిన అవసరముంది.