బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వండి .. ఎన్డీయే సర్కారుకు జేడీయూ డిమాండ్​

బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వండి .. ఎన్డీయే సర్కారుకు జేడీయూ డిమాండ్​
  •     పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో తీర్మానం
  •     జేడీయూ నేషనల్​ వర్కింగ్ ప్రెసిడెంట్​గా సంజయ్​ఝా

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న జనతాదళ్​యునైటెడ్​.. కూటమి ఎదుట గట్టి డిమాండ్​లు పెట్టింది. బిహార్​కు స్పెషల్ ​స్టేటస్​ లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. అలాగే, పేపర్​ లీక్​ ఘటనలపై దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది.  పార్టీ నేషనల్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా రాజ్యసభ ఎంపీ సంజయ్​ఝాను నియమించింది. 

శనివారం ఆ పార్టీ అధినేత, బిహార్​ సీఎం నితీశ్​కుమార్​అధ్యక్షతన నిర్వహించిన జేడీయూ నేషనల్​ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో పలు తీర్మానాలు చేసింది. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలను తీర్చేందుకు ఎన్డీయే సర్కారు ప్రభావవంతమైన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తూ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎగ్జామ్స్​లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌‌‌‌లో ప్రత్యేక, కఠినచట్టం చేయాలని తీర్మానించింది. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణం, సాంఘిక సంక్షేమం, మహిళా సాధికారత, దేశ భద్రత రంగాల్లో మరింత క్రియాశీలంగా, గుణాత్మకంగా సంస్కరణలు తీసుకురావాలని కోరింది. బిహార్​లో​ ఎన్డీయే ప్రభుత్వాన్ని నడపడంలో, మోదీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నితీశ్​ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారని, ఆయన రాజకీయ చతురత, సానుకూల వ్యూహాన్ని తీర్మానం ప్రశంసించింది. 

కేంద్రం నుంచి సాయం పొందడమే లక్ష్యం

కేంద్రం నుంచి బిహార్​కు సాయం పొందడమే పార్టీ లక్ష్యమని జేడీయూ వర్కింగ్​ ప్రెసిడెంట్​ సంజయ్​ ఝా తెలిపారు. ఆ సాయం స్పెషల్​ స్టేటస్​ లేదా స్పెషల్​ప్యాకేజీ ఇలా ఏ పేరుతో చేసినా ఫర్వాలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్​ కొత్తేమీ కాదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అని పేర్కొన్నారు.  బీజేపీ, జేడీయూ మధ్య ఎప్పుడూ సత్సంబంధాలే ఉంటాయని స్పష్టం చేశారు. రెండు పార్టీలు సహజ మిత్రపక్షాలేనని పేర్కొన్నారు. కాగా, కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో 12 మంది సభ్యుల బలంతో  జేడీయూ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ క్రమంలోనే ‘స్పెషల్​ స్టేటస్’​ అంశంపై ఆ పార్టీ తాజాగా తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.