జల్సాలు చేసేందుకు బైక్ చోరీలు .. 17 బైకులు స్వాధీనం  

జల్సాలు చేసేందుకు బైక్ చోరీలు .. 17 బైకులు స్వాధీనం  

జీడిమెట్ల, వెలుగు: జల్సాలు చేసేందుకు బైక్ లు చోరీ చేస్తోన్న ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. 17 బైక్​లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. బాలానగర్​ఏసీపీ హనుమంతరావు  మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాజుల రామారం పరిధి నెహ్రూనగర్​కు  చెందిన గోగుల దేవ సహాయం అలియాస్​ దేవ (27) స్టోన్​కటింగ్​వర్క్ చేస్తుంటాడు. మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం ధర్మసాగర్ కు చెందిన రెడ్డి రమేష్​ (27) ఎలక్ట్రీషియన్.  వీరు గత డిసెంబర్ లో షాపూర్​నగర్​లోని కల్లు దుకాణం వద్ద పరిచయం అయ్యారు.

ఇద్దరూ తాగుడుకు బానిసలుగా మారారు. ఈజీ మనీ కోసం ఇంటి ముందు పార్క్​చేసిన మొత్తం 17 బైకులను చోరీ చేశారు. వాటిని షాపూర్​నగర్​పరిధి కళావతినగర్​కు చెందిన మన్నె రాజు (35), నిజామాబాద్​కు చెందిన  కలాల్​ శివకుమార్ గౌడ్​ (23) వద్ద తనఖా పెట్టేవారు.  వచ్చిన డబ్బుతో నలుగురు జల్సాలు చేసేవారు.  బైక్​ల చోరీపై అందిన ఫిర్యాదులతో జీడిమెట్ల పోలీసులు స్పెషల్ ​టీమ్ తో నిఘా పెట్టి  దేవ సహాయం, రెడ్డి రమేష్​, మన్ను రాజును అరెస్ట్​ చేశారు.  మరో నిందితుడు శివకుమార్​ గౌడ్ పరారీలో ఉన్నాడు.