JEE,NEET పరీక్షలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు

JEE,NEET పరీక్షలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు

సెప్టెంబర్‌లో జరగనున్న JEE,NEET పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  దీనికి సంబంధించి ఇవాళ(సోమవారం) న్యాయమూర్తులు పిటిషన్‌ను కొట్టివేశారు. పరీక్షలను వాయిదా వేయడంతో విద్యార్థులు నష్టపోతారని సుప్రీం వ్యాఖ్యానించింది. ఒక ఏడాదిపాటు అకాడమిక్ ఇయర్‌ను వారు కోల్పోతారని, అందువల్ల అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని, కనుక పరీక్షలను వాయిదా వేయలేమని కోర్టు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు JEE మెయిన్స్ ను ఆన్‌లైన్ మోడ్‌లో, సెప్టెంబర్ 13న నీట్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 161  సెంటర్లలో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. వారి తరఫున  లాయర్ అలఖ్ అలోక్ శ్రీవాత్సవ కోర్టులో వాదనలు వినిపించారు. కరోనా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఇందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ సోమవారం వారి పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో వచ్చే నెలలో యథావిధిగా ఆయా పరీక్షలు జరగనున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ త్వరలో వస్తుందని..మన ప్రధాని మోడీ తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలిపారని, అందువల్ల అప్పటి వరకైనా పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనంలోని జడ్జి అరుణ్ మిశ్రా స్పందిస్తూ, కోవిడ్ ఉన్నప్పటికీ జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తారని, ఇంకా ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తుపై పరీక్షలు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని తెలుపుతూ ..  అందువల్ల పరీక్షలను వాయిదా వేయడం కుదరని స్పష్టం చేశారు.