చిరంజీవి కేసులో..జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష

చిరంజీవి కేసులో..జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష

పరువునష్టం కేసులో టాలీవుడ్ నటులు, దంపతులు జీవిత, రాజశేఖర్ లకు నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2011లో దాతల నుంచి ఉచితంగా రక్తాన్ని సేకరించి మార్కెట్లో అమ్ముకుంటున్నారని.. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై జీవిత రాజశేఖర్ దంపతులు అసత్య ఆరోపణలు చేశారంటూ నిర్మాత అల్లు అరవింద్ గతంలో పరువునష్టం దావా వేశారు.

2011లో ఒక ప్రెస్ మీట్లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. వీటిని ఆధారంగా చేసుకుని అల్లు అరవింద్ డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు. దీంతో 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే.. జీవిత, రాజశేఖర్ దంపతులు జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.