
- కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: జగిత్యాలలో కాంగ్రెస్ కోసం కలిసి పనిచేయడానికి అక్కడి ఎమ్మెల్యే సంజయ్ ఎవరు? అని.. అసలు ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే అని సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సంజయ్ ది ఏ పార్టీనో అసెంబ్లీ స్పీకర్ ను అడిగితే తెలుస్తుందని అన్నారు. తాను సీనియర్ లీడర్ ను అని, జగిత్యాల అభివృద్ధిపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుందని అన్నారు.
కులగణన చేయడంతో బలహీనవర్గాలకు న్యాయం జరుగుతోందనేది రాహుల్ గాంధీ ఆలోచన అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేసి, ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించడంతో ఇప్పుడు ఇది కేంద్రం చేతిలో ఉందన్నారు. ఓబీసీల రిజర్వేషన్ లు కూడా రాష్ట్రాలకు అనుగుణంగా చేయాలని కోరారు.