
కాగజ్‌నగర్, వెలుగు: ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వెనుక కమీషన్ల కక్కుర్తి దాగి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం కుంమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును మూలన పడేసిందని ఆరోపించారు. మొదట్లో సీఎం కేసీఆర్ తుమ్మిడిహట్టి సహా పలు ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతో మహారాష్ట్రతో 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తామని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారన్నారు. అయితే మాటలు చెప్పడం తప్ప ఏ పనీ చేయలేదని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా ఇక్కడ నీళ్లు లభించవని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇక్కడ ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ తరఫున ఉద్యమం చేపడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, పీసీసీ నాయకులు వసంత్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి హరీశ్ తదితరులు ఉన్నారు.