
ఇస్లామాబాద్: భారత్ లో ఉగ్రవాద దాడులను పాకిస్థాన్ ప్రోత్సాహిస్తోందని ఆ దేశ మాజీ అద్యక్షుడు స్వయంగా ఒప్పుకున్నారు. పాక్ ఆర్మీ, ఇంటెజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ వెన్నుదన్ను తోనే జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు అటాక్స్ చేస్తున్నాయని పర్వేజ్ ముషారఫ్ చెప్పారు. పాకిస్థాన్ లోని హమ్ టీవీ డిజిటల్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. జైషే మహమ్మద్ వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. భారత్ లో దాడులకు జైషేని ఐఎస్ఐ వాడుకుందని చెప్పారు. తనను హత్య చేసేందుకు కూడా 2003లో జైషే పలుమార్లు ప్రయత్నించిందని చెప్పారు.
మంగళవారం నాడు పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశంలోని జైషే సంస్థ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సహా 44 మందిని అదుపులోకి తీసుకుంది. ఈ చర్యలను ఎప్పుడో తీసుకోవాల్సిందని ముషారఫ్ అన్నారు. అయితే పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇప్పటికైనా నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.