గ్లోబల్ వార్మింగ్​పై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి: జెన్నిఫర్ లార్సన్

గ్లోబల్ వార్మింగ్​పై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి: జెన్నిఫర్ లార్సన్
  • సమాజ మనుగడే ప్రశ్నార్థకమైతున్నది: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
  • యూఎస్ కాన్సులేట్, వ్యూస్, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో క్లైమేట్ చేంజ్ వర్క్ షాప్

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ మార్పులపై జర్నలిస్టులకు ఎక్కువ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్​తో చాలా దేశాల్లో అడవులు తగలబడుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా సమస్య తీవ్రమవుతున్నదని పేర్కొన్నారు. లోకల్ ఎఫెక్ట్​లతో కలిపి పర్యావరణ మార్పులపై స్టోరీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని సూచించారు. గురువారం హైదరాబాద్​లో యూఎస్ కాన్సులేట్ జనరల్, వ్యూస్, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో క్లైమేట్ చేంజ్​పై జర్నలిస్టులకు వర్క్​షాప్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాల రూపంలో సమాజ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్నారు.

 కీలకమైన పర్యావరణ మార్పుల సమస్యలపై జర్నలిస్టులూ పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉందన్నారు. క్లైమేట్ ఛేంజ్ తో భవిష్యత్తులో జరగబోయే విపత్తులను గుర్తించలేకపోతున్నామని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్​ను పేదోళ్ల ఊటీ అనేవారని, అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న.. సిటీ ఇప్పుడు కాలుష్య విషంతో కొట్టుమిట్టాడుతున్నదన్నారు. పర్యావరణ మార్పులు ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితం కావని, ప్రపంచవ్యాప్తంగా ముప్పు ఉందని విరాహత్ అలీ అన్నారు. కార్యక్రమంలో వ్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భీమారావు తదితరులు పాల్గొన్నారు.